ఆయన కోసం రాలేదన్న చిరు

Update: 2017-04-09 06:16 GMT
మెగాస్టార్ చిరంజీవికి ఉత్తరాంధ్ర జిల్లాలతో.. ముఖ్యంగా విశాఖపట్నంతో ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఆయన ప్రతి సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకునేది. అక్కడి ప్రేక్షకులకు చిరు సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. అందుకే విశాఖ పేరెత్తితే చిరులో ఎక్కడలేని ఉత్సాహం.. ఉద్వేగం వచ్చేస్తుంది. తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డుల వేడుక కోసం విశాఖకు వెళ్లిన చిరు.. మరోసారి ఈ ప్రాంతంపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వేడుకకు తాను టీఎస్సార్ కోసం రాలేదని.. కేవలం ఇక్కడి అభిమానుల కోసమే వచ్చానని అన్నారు. తన కోసమే వచ్చానని టీఎస్సార్ అనుకుంటే అది పొరబాటని చిరు చమత్కరించాడు.

‘‘నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే అభిమానులు నన్ను గొప్పగా ఆదరిస్తారు. ఈలలు, చప్పట్లతో ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొస్తారు. ఇక్కడి వాళ్లు నా మీద చూపించే అభిమానం అసాధారణం. అందుకే వైజాగ్‌ రావడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా సరే చాలా ఉత్సాహంగా వస్తాను. పాపం నాకోసమే చిరు వచ్చారని సుబ్బిరామిరెడ్డి గారు అనుకుంటున్నారు. కాదు నేను మీ కోసమే వచ్చాను. బిజీ షెడ్యూల్‌‌ వల్ల ఈ వేడుకకు రాలేనేమో అనుకున్నా. కానీ ఎలాగోలా వీలు చూసుకుని వచ్చేశా. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి అన్నాడు. చిరు తన కోసం రాలేదని అన్నపుడు పక్కనే ఉన్న సుబ్బిరామిరెడ్డి గట్టిగా నవ్వుతూ కనిపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News