పవన్ ఆడియోకు చిరు వస్తాడా?

Update: 2016-01-31 11:30 GMT
మెగా ఫ్యామిలీ హీరోల ఆడియో ఫంక్షన్ అనగానే.. దానికి ఎవరు అతిథిగా వస్తారు? ఏం మాట్లాడతారు? అభిమానులు ఎలా రెస్పాండ్ అవుతారు? అనే విషయాలు హాట్ టాపిక్ అయిపోతుంటాయి. మెగా ఫ్యామిలీలో చివరగా జరిగిన ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్ ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. ఇక ఆ ఫ్యామిలీలో తర్వాత జరగబోయే ఆడియో ఫంక్షన్ల విషయంలో కూడా జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖర్లో లేదా మార్చి మొదటి వారంలో ‘సర్దార్..’ ఆడియో ఫంక్షన్ జరిగే అవకాశముంది.

ఐతే ఈ ఆడియో ఫంక్షన్ గురించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు ఎడమొహం పెడమొహంగా ఉన్న పవన్, చిరు ఈ మధ్య దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ‘బ్రూస్ లీ’ సినిమాతో చిరు పునరాగమనం చేసిన టైంలో పవన్ స్వయంగా ఆయనింటికి వెళ్లి అభినందించి వచ్చాడు. ఈ మధ్యే చిరు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లోకి వెళ్లి మరీ తమ్ముణ్ని కలిసి వచ్చాడు. ఇప్పుడిక అన్నదమ్ముల బంధం మరింత బలపడిందని చాటడానికి ‘సర్దార్..’ ఆడియో ఫంక్షన్‌ కు చిరును ముఖ్య అతిథిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు.
Tags:    

Similar News