చిరు జ‌న్మదినం.. త‌మ్ముడు ప‌వ‌న్ భావోద్వేగం!

Update: 2022-08-22 06:07 GMT
ఆగ‌స్టు 22 ఏంటో తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినం.. ఆగ‌స్టు 22 అనేది చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతారు. సామాన్య కుటుంబంలో పుట్టి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు, అభిమానులు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని, చిరంజీవి చిన్న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా భావోద్వేగంతో త‌న అన్న‌పైన ప్రేమ‌ను చాటుకున్నారు.

నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి ల‌భించాల‌ని కోరుకుంటున్నాను అని ప‌వ‌న్ క‌ల్యాణ్ సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

తెలుగు భాష‌లో నాకు ఇష్ట‌మైన ప‌దం.. అన్న‌య్య అని ప‌వ‌న్ తెలిపారు. ఎందుకంటే తాను ఆరాధించే చిరంజీవి గారిని అన్న‌య్య అని పిల‌వ‌డ‌మో కార‌ణ‌మేమోన‌న్నారు. ఆయ‌న‌ను అన్న‌య్య అని పిలిచిన‌ప్పుడ‌ల్లా అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతి క‌లుగుతుంది. అటువంటి అన్న‌య్య‌కు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా అనురాగ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.

అన్న‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా నాలుగు మాట‌లు చెప్పాలంటే ఒకింత‌ క‌ష్టం. ఎందుకంటే ఆయ‌న జీవితం తెరిచిన పుస్త‌కం. ఆయ‌న ఇంత‌వాడు.. అంత‌వాడైన విష‌యం చెప్పాలా?.. ఆయన సాధించిన విజ‌యాలు గురించి చెప్పాలా?.. ఆయ‌న సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి విష‌యం చెప్పాలా?.. ఆయ‌న అధిరోహించిన ప‌ద‌వుల గురించి చెప్పాలా?.. ఆయ‌న కీర్తి ప్ర‌తిష్ట‌ల గురించి చెప్పాలా.. ఆయ‌న సేవా త‌త్ప‌ర‌త గురించి చెప్పాలా? ఇవ‌న్నీ తెలుగువారంద‌రితోపాటు యావ‌త్ భార‌తదేశానికి విదిత‌మే.

అన్న‌య్య‌లోని గొప్ప మాన‌వ‌తావాది గురించి చెప్ప‌డ‌మే నాకిష్టం. దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాల‌నే ఆయ‌న జీవ‌న విధానాన్ని ఎంత పొగిడినా త‌క్కువే. చ‌మ‌ట‌ను ధార‌గా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎంతోమందికి స‌హాయం చేశారు. పేద‌రికంతో బాధ‌ప‌డుతున్నా, అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాలైనా, చ‌దువుకోవ‌డానికి డ‌బ్బులు లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిసినా త‌క్ష‌ణం స్పందించి సాయం చేసే స‌హృద‌యుడు.. అన్న‌య్య‌. కోవిడ్ స‌మ‌యంలో ప‌నులు లేక సినీ కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఆయ‌న చూపిన దాతృత్వం... బ్ల‌డ్ బ్యాంక్ స్థాపించి ల‌క్ష‌లాదిమందితో ఆయ‌న ఏర్ప‌ర‌చుకున్న ర‌క్త సంబంధం... వేలాది గుప్త‌దానాలు.. ఇలా ఒక‌టి రెండూ కాదు.. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఉచిత ఆస్ప‌త్రి వ‌ర‌కు ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌లో మాన‌వ‌తామూర్తిని గుర్తు చేస్తాయి.

అన్నిటిక‌న్నా మిన్న ఆయ‌న‌లో ఒదిగి ఉండే ల‌క్ష‌ణం. తాను క‌ల‌వ‌బోయే వ్య‌క్తి న‌మ‌స్కారం కూడా చేయ‌లేని కుసంస్కారి అయిన‌ప్ప‌టికీ త‌ను చేతులెత్తి న‌మ‌స్క‌రించే సంస్కారం.. చిరంజీవి గారిది. వ‌య‌సు తార‌త‌మ్యాలు, వ‌ర్గ వైరుధ్యాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రినీ అక్కున చేర్చుకునే విశాల హృద‌యుడు.. చిరంజీవి గారు. అటువంటి సుగుణాలు ఉన్న అన్న‌య్య‌కు నేను త‌మ్ముడిని కావ‌డం నా పూర్వ జ‌న్మ సుకృతం. ఈ శుభ‌దినం సందర్భంగా ఆయ‌న‌కు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని.. నాకు త‌ల్లిలాంటి మా వ‌దిన‌మ్మ స‌హ‌చ‌ర్యంలో ఆయ‌న నిండు నూరేళ్లు చిరాయువుగా వ‌ర్థిల్లాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్న రూపంలో ఉన్న నాన్న‌కు మ‌న‌స్ఫూర్తిగా న‌మ‌స్క‌రిస్తున్నాను.
Tags:    

Similar News