కైకాల ఆరోగ్య పరిస్థితిపై చిరూ ట్వీట్!

Update: 2021-11-21 07:51 GMT
కైకాల సత్యనారాయణ .. వెండితెరకి నిండుదనాన్ని తీసుకొచ్చిన పేరు. ఎస్వీ రంగారావు తరువాత ఆ స్థాయి నటుడిగా వినిపించిన పేరు. 'నా వారసుడు కైకాల' అని ఎస్వీ రంగారావు స్వయంగా ప్రకటించిన పేరు. తెలుగు తెరకి 'సిపాయి కూతురు' సినిమాతో హీరోగా పరిచయమైన కైకాల సత్యనారాయణ, ఆ తరువాత ప్రతినాయకుడిగా తన విశ్వరూపం చూపించారు.

సాంఘిక .. జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలలో నటించి మెప్పించారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోతూ 'నవరస నట సార్వభౌమ' అనిపించుకున్నారు. నటుడిగా 5 దశాబ్దాల తన ప్రయాణంలో దాదాపు 800 సినిమాల వరకూ చేశారాయన.

అలాంటి కైకాల ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చిరంజీవితో కలిసి ఆయన చాలా సినిమాలలో నటించారు. చిరంజీవి నటించిన 'కొదమసింహం' సినిమాను నిర్మించినది కైకాలనే.

ఈ మధ్యనే ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తనకి వయసు పైబడినా చిరంజీవి ఉన్నంతవరకూ భయం లేదని అన్నారు. చిరంజీవిపై ఆయనకి అంతటి నమ్మకం .. అభిమానం. అలాంటి కైకాల హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి చిరంజీవి ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.

తాజాగా తాను కైకాల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్న విషయాన్ని గురించి చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. "ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణగారు స్పృహలోకివచ్చారని తెలియగానే, ఆయనని ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయనను ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది.

ట్రాకియాస్టోమీ కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, మళ్లీ త్వరలో ఇంటికి తిరిగిరావాలని .. ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ 'థమ్స్ అప్' సైగ చేసి థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ప్రార్ధిస్తూ, ఆయన అభిమానులు .. శ్రేయోభిలాషులందరితోను ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని రాసుకొచ్చారు. కైకాల అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయం.



Tags:    

Similar News