కమల్ హాసన్ పేరు.. మతంపై దుమారం

Update: 2017-03-28 10:34 GMT
మతానికి సంబంధించిన అంశాల్లో కమల్ హాసన్ తరచుగా వివాదాలు ఎదుర్కొంటూ ఉంటారు. ‘విశ్వరూపం’ సినిమాలో ముస్లింలను కించపరిచేలా చూపించాడంటూ ఆ సినిమా విడుదలను అడ్డుకోవడం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన మహాభారతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రెండు కుటుంబాల గొడవల్లోకి ఓ మహిళను లాగి.. జూదం ఆడిన వాళ్లకు సంబంధించిన గ్రంథాన్ని గొప్పదిగా చెప్పడం.. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలనడం ఎంత వరకు సమంజసం అని కమల్ ప్రశ్నించారు. దీనిపై హిందూవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ దినపత్రికలో కమల్ గురించి ఓ కాలమిస్టు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది.

కమల్ హిందూ వ్యతిరేకి అని.. ఆయన ఇస్లాంను నమ్ముతారని.. అందుకే ఆయన కమల్ హాసన్ అనే పేరు కూడా పెట్టుకున్నారని కాలమిస్టు ఆరోపించారు. కమల్‌ హిందూ, ముస్లింల మధ్య విభేదాలు తలెత్తేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు వ్యాఖ్యానించారు. కమల్ ఓ ముస్లింలాగే మాట్లాడుతున్నారనన్నారు. ‘మహాభారతంపై కామెంట్లు చేయడం కన్నా.. ముస్లిం సంప్రదాయం ‘ట్రిపుల్‌ తలాక్‌’ మీద కూడా మాట్లాడాలని అన్నారు. ఈ కాలమ్‌ దుమారం రేపడం.. కమల్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ నుంచి ఈ వివాదాస్పద వ్యాఖ్యలున్న పేరాగ్రాఫ్ ను తొలగించాల్సి వచ్చింది. నిజానికి కమల్ బ్రాహ్మణ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. ఆయనకు మొదట తల్లిదండ్రులు పార్ధసారథి అని పేరు పెట్టారు. ఐతే కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్‌ ఈ పేరును ‘కమల్‌ హాసన్‌’గా మార్చారు. కమల్ తండ్రి తన స్నేహితుడైన యాకూబ్‌ హసన్‌ కు గుర్తుగా తన కొడుక్కి కమల్‌ హాసన్‌ అని పేరు పెట్టారని కూడా ఓ కథనం హల్ చల్ చేసింది. ఐతే కమల్ దీన్ని ఖండించారు. కమల్‌ అంటే పద్మం అని.. హాసన్‌ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని వివరణ ఇచ్చారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News