మల్లేశం.. ఏందబ్బా ఈ సినిమా సంగతి?

Update: 2018-10-23 09:48 GMT
ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా ఉన్న అగ్ర నిర్మాత సురేష్ బాబు.. కొన్నేళ్ల కిందట శైలి మార్చారు. చిన్న సినిమాలే అందిస్తున్నారు. ఆయన సొంతంగా నిర్మిస్తున్న సినిమాలు కూడా తక్కువే. కొత్తవాళ్లు కలిసి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాల్ని తన చేతికి తీసుకుని బాగా ప్రమోట్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాగే ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’.. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి సినిమాలొచ్చాయి ఆయన్నుంచి. వీటితో పాటు సొంతంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే సినిమాను నిర్మించారు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ ఆసక్తికర చిన్న సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రం పేరు.. మల్లేశం.

పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తున్నాడు. ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా ఇదే. చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేలా ఒక కొత్త యంత్రాన్ని కనిపెట్టి జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు మల్లేశం. అందుకే అతడికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అతడి కథను వాస్తవికంగా.. హృద్యంగా చూపించే ప్రయత్నం చేస్తోందట చిత్ర బృందం. షూటింగ్ అంతా కూడా రియల్ లొకేషన్లలోనే చేస్తున్నారట. తక్కువ బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేస్తున్నారు. ‘పెళ్ళిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ తరహాలో ఇదొక విభిన్న చిత్రం అవుతుందని.. ఇది సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ కు కూడా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.


Tags:    

Similar News