హాస్యనటుడు వేణు మాధవ్ మృతి

Update: 2019-09-25 07:37 GMT
ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ బుధ‌వారం(నేటి) మధ్యాహ్నం 12.21 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు.. కుటుంబ స‌భ్యులు అధికారికంగా ధృవీకరించారు. ఈనెల 6న ఆస్ప‌త్రిలో చేరిన వేణుమాధ‌వ్ కి చికిత్స జ‌రుగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి వేణుమాధ‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉంద‌ని వెంటిలేట‌ర్ పై చికిత్స సాగుతోంద‌ని య‌శోద ఆస్ప‌త్రి వ‌ర్గాల నుంచి వెల్ల‌డైంది. అయితే ఇంకా చికిత్స జ‌రుగుతుండ‌గానే వేణు మాధ‌వ్ మ‌ర‌ణించార‌ని ప్ర‌చారం సాగ‌డంతో కొంత గంద‌ర‌గోళం త‌ప్ప‌లేదు. ఈ విష‌యంపై కుటుంబ స‌భ్యులు.. అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వేణుమాధ‌వ్ చ‌నిపోయార‌ని వైద్యులు అధికారికంగా ధృవీక‌రించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన `సంప్రదాయం` చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన వేణుమాధవ్ దాదాపు 400 చిత్రాలలో నటించారు. తొలి ప్రేమ‌- దిల్- ఆది- సై- సింహాద్రి-ఛ‌త్ర‌ప‌తి- వెంకీ-పోకిరి-ర‌చ్చ ఇలా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో టిట్టిబి అనే పాత్ర‌తోనూ ఆక‌ట్టుకున్నారు. న‌టుడిగా త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన‌ ఎస్వీకే ద‌ర్శ‌క‌త్వంలోనే `హంగామా` సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన ఆ తర్వాత తానే నిర్మాతగా.. కథానాయకుడిగా భూకైలాస్-ప్రేమాభిషేకం చిత్రాల్ని నిర్మించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనూ పనిచేశారు. కోదాడకు చెందిన వేణుమాధవ్ హైదరాబాద్ మౌలాలీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య శ్రీవాణి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే గ‌త కొన్నేళ్లుగా వేణుమాధ‌వ్ న‌ట‌న‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానుల్లో దీనిపై చ‌ర్చ సాగింది. ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న న‌ట‌న‌ను విర‌మించుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌కుముందు వేణుమాధ‌వ్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించార‌ని మీడియాలో ప్ర‌చారం కావ‌డంతో స్వ‌యంగా మీడియా ముందుకు వ‌చ్చి వేణుమాధ‌వ్ కంట‌త‌డి పెట్ట‌డం ఫ్యాన్స్ ను క‌ల‌చి వేసింది.
Tags:    

Similar News