‘ఊరికి ఉత్తరాన’ మూవీ మీద లొల్లేమిటి? ఎందుకీ రచ్చంత?

Update: 2021-11-10 13:30 GMT
ఇటీవల కాలం లో విడుదలవుతున్న సినిమాలు తరచూ వివాదాలకు గురవుతున్నాయి. తాజా గా ఆ జాబితా లోకి చేరింది ‘‘ఊరికి ఉత్తరాన’’ సినిమా. నవంబరు 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా పై ఆసక్తి వ్యక్త మవుతోంది. వరంగల్ లో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారం గా నిర్మించినట్లు చెబుతున్నారు. ‘ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే’ అన్న ఉప శీర్షికతో తీస్తున్న ఈ మూవీ మొదట్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలవుతుందని చెప్పినా.. తాజాగా మాత్రం థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీకి పోస్టర్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీసింది. ఈ సినిమాలో తెలంగాణను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నట్లుగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా గన్ పార్కు వద్ద తెలంగాణ వాల్మీకి సంఘం ఈ సినిమా విడుదలను ఆపాలంటూ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నమైన కాకతీయ తోరణానికి ఒక వ్యక్తిని తలకిందులుగా ఉరి వేసేలా ఉన్న సన్నివేశంపై వారు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. దానికి సంబంధించిన పోస్టర్ ను చూపిస్తున్నారు.

ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సంస్థతో పాటు కోన వెంకట్.. వేణు శ్రీరామ్ ల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన సతీష్ పరమవేద దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీతో నరేన్ హీరోగా పరిచయం అవుతుంటే.. దీపాలి హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ల కారణంగా ఇప్పటికే ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా మొదలైన ఈ వివాదం.. సినిమాకు మరింత ప్రచారాన్ని కల్పిస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News