కాపీ ఆరోపణలు మాత్రం ఆగట్లేదే..

Update: 2018-09-20 11:44 GMT
సంగీత దర్శకులపై కాపీ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నవాళ్లే. ఇక టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన తమన్ ఈ విషయంలో లెక్కలేనన్నిసార్లు బుక్ అయ్యాడు. తమన్ కాపీ సాంగ్స్ అని యూట్యూబ్‌ లోకి వెళ్లి కొడితే.. రెండంకెల సంఖ్యలో పాటలు వచ్చి పడతాయి. ఐతే సంగీతం విషయంలో మంచి అభిరుచి ఉన్న త్రివిక్రమ్‌ తో తమన్ తొలిసారి పని చేస్తుండటంతో ఈసారి ఇలాంటి ఆరోపణలేమీ రాకుండా చూసుకుంటాడని.. అనుకున్నారంతా. కానీ తమన్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటల మీదా కాపీ ఆరోపణలు రావడం గమనార్హం.

‘అరవింద సమేత’ నుంచి వచ్చిన తొలి పాట ‘అనగనగా..’ ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలోని ఓ పాటకు కాపీ అన్న ఆరోపణలు వినిపించాయి. రెండు పాటల్ని పక్క పక్కనే పెట్టి ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మి-నాగ్ సీన్‌‌ తో లింక్ చేసి తమన్‌ ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు జనాలు. ఐతే ‘పెనివిటి’ సాంగ్ గురించి ముందు నుంచి గొప్పగా చెబుతుండటంతో ఇది ఆ తరహాలో ఉండదని.. ఏదో కొత్తగా చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ ఈ పాట విషయంలోనూ ఇప్పుడు కాపీ ఆరోపణలు తప్పట్లేదు. కీరవాణి తనయుడు కాలభైరవ పాడిన ఈ పాట ‘పండగ చేస్కో’లోని ఒక పాటకు దగ్గరగా ఉంది. ‘ఓ మై ఫ్రెండ్’ తమన్ సినిమా కాదు. అతను కాపీ కొట్టాడంటున్న ట్యూన్ రాహుల్ రాజ్ అనే మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఐతే ‘పండగ చేస్కో’ తమన్ సినిమానే. ఆ పాట వింటే.. ‘పెనివిటి’లోని రాగానికి దగ్గరగానే అనిపిస్తోంది. అదే సమయంలో ‘బాహుబలి-2’లో కాలభైరవనే పాడిన దండాలయ్యా పాటకు కూడా ఇది కొంచెం కలుస్తోంది. మొత్తానికి తమన్ మీద మరోసారి ఆరోపణలు తప్పట్లేదు. అతడి మీద విమర్శల జడి ఆగట్లేదు. మరి ఆడియోలోని మిగతా రెండు పాటల సంగతేంటో చూడాలి.
Tags:    

Similar News