విషాదం: దాసరి ఇక లేరు

Update: 2017-05-30 14:34 GMT
దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన మరణంతో మొత్తం తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన దాసరి మరణవార్తను.. ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

గత కొన్ని నెలలుగా దాసరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. దాదాపు మూడు నెలలు చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. వారం రోజుల క్రితం మరోసారి ఆరోగ్యం విషమించడంతో.. కిమ్స్ ఆస్పత్రిలో చేరినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇవాళ సాయంత్రం దాసరి మరణించినట్లు కిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈమాట తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.

1942 మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి.. చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చారు. 1972లో తాతా మనవడు చిత్రంతో దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకున్న డైరెక్టర్ దాసరి. తన కెరీర్ లో మొత్తం 9 నంది అవార్డులు.. 2 నేషనల్ అవార్డులు.. 4 ఫిలింఫేర్ అవార్డులను దాసరి అందుకున్నారు. మేఘ సందేశం.. కంటే కూతుర్నే కనాలి చిత్రాలకు గాను జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

మొత్తం 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి చివరి చిత్రం ఎర్రబస్సు. 250కి పైగా చిత్రాలకు కథ-సంభాషణలు అందించిన దాసరి నారాయణ రావు.. 53 చిత్రాలను నిర్మించారు. ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయంగా కూడా కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి దాసరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News