అవేం మాటలు దాసరి గారూ..

Update: 2016-07-25 17:30 GMT
దాసరి నారాయణరావును తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కుగా భావిస్తారు. ఎవర్ని ఏమైనా అనగలిగే ధైర్యం, మందలించగలిగే పెద్దరికం ఆయన సొంతం. ఐతే ఆయన పర్టికులర్‌గా కొందరి మీద చేసే విమర్శల మీదే అభ్యంతరాలు వస్తుంటాయి. అంతే కాక.. ఓ విషయాన్ని తప్పుబడుతూనే ఆయన కూడా అదే చేయడం కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. తెలుగులో జరిగే ఆడియో వేడుకల మీద ఇప్పటికే చాలాసార్లు విమర్శలు గుప్పించారు దాసరి. ఆడియో వేడుకలంటే రికార్డింగ్ డ్యాన్సుల్లాగా మారిపోయాయని.. ఒకరినొకరు పొగుడుకోవడమే పనైపోయిందని.. ముఖ్యంగా హీరోల్ని అతిగా పొగిడేస్తున్నారని అన్నారు దాసరి.

నిన్న ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు దాసరి. తన ప్రసంగం మొదట్లో తాను ఆడియో వేడుకలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని.. కొన్ని ఆడియో ఫంక్షన్ల తీరు చూశాక అలా అనిపిస్తోందని అన్నారు దాసరి. కానీ ‘బాబు బంగారం’ ఆడియో వేడుక మాత్రం పండుగలాగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఆడియో వేడుకలో కూడా ఎప్పుడూ జరిగేదే జరిగింది. ముందు వెంకటేష్ సినిమాల్లోని కొన్ని పాటలకు స్టెప్పులేశారు డ్యాన్సర్లు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి వెంకీని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే వెంకీ విషయంలో డోస్ ఇంకొంచెం ఎక్కువే అయింది. స్వయంగా దాసరి సైతం వెంకీని ఆకాశానికెత్తేశారు. మరి మిగతా ఆడియో వేడుకలకు.. దీనికి ఏం తేడా ఉందనేదే ఇక్కడ సందేహం రేకెత్తించే విషయం. మరి దాసరి వేరే సినిమాల ఆడియో వేడుకల విషయంలో అలా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం.
Tags:    

Similar News