ట్రోలింగ్ ఎఫెక్ట్.. వీవీఆర్ ట్రైన్ సీన్ కు కత్తెర!

Update: 2019-01-13 07:09 GMT
హీరోయిజం ఎలివేషన్ పేరుతో కొందరు దర్శకులు లాజిక్ కు లక్షకిలోమీటర్లు దూరంగా ఉండేలా.. కొన్ని సీన్లు డిజైన్ చేస్తూ ఉంటారు.  గతంలో దాదాపు అందరూ హీరోల సినిమాల్లో ఈ గోల ఉండేది గానీ బాలయ్య సినిమాలో మాత్రం ఆ మోతాదు శృతి మించేది.  బాలయ్య సినిమాల్లోని ట్రైన్ ను ఆపే సీన్లు.. తోడ గోడితే భూమి కంపించడం.. చిటికేస్తే కుర్చీ రావడం.. ఇలా చాలానే ఉన్నాయి.  ఇలాంటి సీన్ల మీద సోషల్ మీడియాలో జోకులకు కొదవే లేదు. మీమ్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా బోయపాటి పుణ్యమా అని చరణ్ కూడా ఈ లిస్టు లో చేరిపోయాడు.

జనవరి 11 వ తేదీన విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమాలో హీరోయిజం పేరిట ఇలాంటి లాజిక్ లేని సీన్లు పెట్టాడు బోయపాటి.  అందులో ట్రైన్ సీన్..  రౌడీలను తలలను నరికితే గద్దలు ఆ తలలను లడ్డూల్లా పట్టుకుపోవడం లాంటివి ఉన్నాయి.  వీటిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో బోయపాటిని.. చరణ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.  ముఖ్యంగా ట్రైన్ సీన్ పై చరణ్ కు ఫుల్ గా సెటైర్లు పడుతున్నాయి.

చావు బతుకుల్లో ఉన్న అన్నయ్య ఫోన్ చేస్తే ఎయిర్ పోర్ట్ నుండి అద్దాలు పగల కొట్టుకుంటూ ఎగిరి ట్రైన్ పై దూకేయడం.. అలానే నిలబడి బీహార్ వరకూ కొద్ది గంటల్లో వెళ్ళిపోవడం.. మధ్యలో ఒక చోట ఆగి ఒంటిపై పచ్చబొట్లు వేయించుకోవడం. ఈ సీన్  జనాలను పిచ్చెక్కించింది.  దీనికి నెటిజనులకు ఫుల్ గా  సెటైర్లు వేస్తున్నారు.  పాపం టికెట్ లేదని ఒకరి జాలి చూపిస్తే.. సంక్రాంతికి ఊరికెళ్ళే జనాలకు చరణ్ కొత్త రకం దారి చూపిస్తున్నాడని అంటున్నారు.  మరి ఇలాంటి విమర్శలు.. ట్రోలింగ్ బోయపాటి శ్రీను టీమ్ కు చేరినట్టుంది. ఈ ఫీడ్ బ్యాక్ ను సవినయంగా.. సహృదయంగా స్వీకరించి ట్రైన్ సీన్ ను తొలగించారు.

సీ-సెంటర్లు తప్ప ఇప్పటికే మల్టిప్లెక్సుల్లోనూ.. చాలా బీ-సెంటర్లలోనూ ఈ సీన్ ను తొలగించారు. ఇక మీలో ఎవరైనా ఆ సీన్ ను వెండివెరపై చూడాలనుకుంటే మాంచి మాస్ సి-సెంటర్ ను వెతుక్కోవాల్సిందే.


Full View

Tags:    

Similar News