దేవి.. రివర్స్ పంచ్ ఇస్తాడా?

Update: 2017-12-23 09:22 GMT
2017 దేవిశ్రీ ప్రసాద్ కు అంత గుర్తుంచుకోదగ్గ సంవత్సరమేమీ కాదు. ఈ ఏడాది దేవి చాలా సినిమాలే చేశాడు కానీ.. అతడి గత సినిమాల స్థాయిలో అవి పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘ఖైదీ నంబర్ 150’.. ‘నేను లోకల్’ సినిమాలతో ఓకే అనిపించాడు దేవి. కానీ ఆ తర్వాత అతను సంగీతం అందించిన సినిమాల ఆడియోలకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ‘దువ్వాడ జగన్నాథం’... ‘జై లవకుశ’ ఆడియోలు యావరేజ్ అన్న ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. దేవిశ్రీ రొటీన్ బాటలో సాగిపోతున్నాడన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐతే ఆ సినిమాల్లో ఒకటో రెండో పాటలైనా ప్రత్యేకంగా అనిపించాయి. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి దేవిశ్రీ రేంజ్ ఇంకా తగ్గిపోయింది.

ఇదే సమయంలో ‘హలో’ సినిమాతో అనూప్ రూబెన్స్.. ‘అజ్ఞాతవాసి’తో అనిరుధ్ చాలా మంచి పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇప్పుడు తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అతడి చేతిలో రెండు మెగా ప్రాజెక్టులున్నాయిప్పుడు. ఒకటి ‘రంగస్థలం’ అయితే.. ఇంకోటి ‘భరత్ అను నేను’. పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా దేవి.. సినిమాలో విషయాన్ని బట్టే మ్యూజిక్ ఇస్తాడని అంటారు. ఈ ఏడాది అతడి ఆడియోలు అలా ఉండటానికి ఆయా సినిమాల కంటెంట్ కూడా కారణమే అంటున్నారు అతడి సన్నిహితులు. స్క్రిప్టులో ప్రత్యేకత ఉంటే.. దేవి కూడా మ్యూజిక్ అలాగే చేస్తాడన్నది వాళ్ల అభిప్రాయం. ఆ కోణంలో చూస్తే ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’ వెయిట్ ఉన్న సినిమాలే. ఆ చిత్రాల దర్శకులు అభిరుచి ఉన్నవాళ్లు. వాళ్ల సినిమాల స్క్రిప్టుల్లో వెయిట్ ఉంటుంది. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మరి ఈ సినిమాలతో తనేంటో చూపిస్తూ దేవిశ్రీ రివర్స్ పంచ్ ఇస్తాడేమో చూద్దాం.

Tags:    

Similar News