పంచ్ పడింది.. రౌడీ హీరో పైన అంటున్నారే!

Update: 2019-08-08 08:17 GMT
తెలుగులో ఎంతోమంది స్టార్లున్నారు కానీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తీరే వేరు.  మిగతా స్టార్లందరూ సూపర్ హిట్లు సాధించిన తర్వాత తమకు 'స్టార్' అనే తోక తగిలించుకున్నారు కానీ సంపూ మాత్రం మొదటి సినిమా 'హృదయ కాలేయం' విడుదల కాకమునుపే బర్నింగ్ స్టార్ పేరుతో పాపులర్ అయ్యాడు. ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత సంపూ పేరు 'స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ యాప్' లాగా కామన్ అయిపోయింది.  సంపూ తాజాగా 'కొబ్బరిమట్ట' అనే వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

బుధవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. 'కొబ్బరిమట్ట' ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. సంపూ స్పీచ్ ఇచ్చే సమయంలో తనదైన శైలిలో రెచ్చిపోతుంటే.. ఆ సమయంలో ఒక బర్నింగ్ ఫ్యాన్ బౌన్సర్లను దాటుకొని స్టేజిమీదకు వచ్చి 'సంపూ అన్నా'  అంటూ బర్నింగ్ స్టార్ కాళ్ళపై పడిపోయాడు.  ఆ తర్వాత బౌన్సర్లు ఆ అభిమానిని కిందకు తీసుకెళ్ళిపోయారు.  ఇలా అభిమానులు తమ ఫేవరెట్ హీరో దగ్గరకు రావడం.. వారి కాళ్ళపై పడిపోవడం మనం ఎన్నో ఈవెంట్లలో చూసే ఉంటాం.  అయితే ఈ పాదనమస్కారం ఎపిసోడ్ మాత్రం కొంచెం కృత్రిమంగా అనిపించింది.  

పెద్ద స్టార్ల విషయంలో ఇలా జరుగుతుంది కానీ సంపూ లాంటి హీరో విషయంలో ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు. ఇంతకీ విషయం ఏమై ఉంటుందా అని కొంచెం కూపీ లాగటానికి ప్రయత్నిస్తే.. 'కొబ్బరిమట్ట' టీమ్ కొందరు యంగ్ టాలీవుడ్ హీరోల ప్రవర్తనపై పంచ్ వేసేందుకు అలా సెటప్ చేశారని టాక్ వినిపించింది.  కొందరు యంగ్ హీరోలు పబ్లిసిటీ కోసం తమ ఈవెంట్లలో ఇలాంటివి సెటప్ చేస్తున్నారట.  ఈమధ్య 'డియర్ కామ్రేడ్' ఈవెంట్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.  ఆ లెక్కన 'కొబ్బరిమట్ట' పంచ్ రౌడీ హీరోపైన వేసినట్టా?
    

Tags:    

Similar News