నాని సినిమాని ఆ దర్శక నిర్మాత తీసుకున్నాడా..?

Update: 2022-09-14 16:30 GMT
నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ థియేట్రికల్ రైట్స్ ను చదలవాడ బ్రదర్స్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు సుధాకర్. కానీ దానికి తగ్గ విజయాలను అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాదిలో ఆయన బ్యానర్ లో వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' 'విరాటపర్వం' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించలేదు.

అయినప్పటికీ 'దసరా' సినిమాపై భారీ బడ్జెట్ పెడుతుండటంతో.. నిర్మాత చెరుకూరి సుధాకర్ రిస్క్ చేస్తున్నాడేమో అనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ కు ఏడు నెలల ముందుగానే 'దసరా' థియేటర్ బిజినెస్ ను సింగిల్ పాయింట్ కింద సేల్ చేసేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తెలుగులో కొన్ని చిత్రాలను నిర్మించడమే కాదు.. పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన చదలవాడ శ్రీనివాస్ 'దసరా' థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసారట. ఓవర్ సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులు 25 - 28 కోట్ల మధ్య  పలికాయని.. సింగిల్ పాయింట్ లో నిర్మాత ఈ డీల్ ను క్లోజ్ చేశారని అంటున్నారు.

సుధాకర్ చెరుకూరి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ చూడటం.. ఇప్పుడు 'దసరా' కు నిధుల కొరత ఏర్పడటంతోనే చదలవాడ శ్రీనివాసరావు కు రైట్స్ అమ్మినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రానికి మేకర్స్ 65 - 70 కోట్ల బడ్జెట్ అంచనా వేసుకున్నారని.. ఇప్పుడు థియేటర్ మరియు నాన్-థియేటర్ కలిపి 80 - 85 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు.

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న నాని.. 'దసరా' చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం తొలిసారిగా డీ గ్లామర్ లుక్ లో.. రఫ్ అండ్ రగ్గుడ్ అవతార్ లోకి మారిపోయారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

'దసరా' చిత్రాన్ని 2023 శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News