విలన్ రోల్ చేయడానికి అన్ని కోట్లు అడిగాడా?

Update: 2022-02-07 11:14 GMT
జీవితంలో ఎదగాలంటే కసి .. కృషి రెండూ ఉండాలి. అప్పుడే అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా పట్టుదలతో పరిగెత్తి అనుకున్న లక్ష్యానికి చేరుకున్న వారిలో ఎస్.జె. సూర్య ఒకరుగా కనిపిస్తాడు. మొదటికి నుంచి కూడా ఆయనకి నటుడు కావాలని ఉండేదట. అయితే తన పర్సనాలిటీ చూసి తనకి అవకాశం ఇచ్చేది ఎవరు? అందువల్ల ముందుగా దర్శకుడిని కావాలి? సక్సెస్ అనేది వచ్చిన తరువాత అప్పుడు నటుడిగా మారవచ్చు. క్రేజ్ వచ్చిన తరువాత పర్సనాలిటీని గురించి ఎవరూ పెద్దగా పట్టుంచుకోరనే ఆలోచనను ఆయన ఎప్పుడో చేశాడు.

అప్పటి నుంచి ఆయన ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి కొన్ని సినిమాలకి దర్శకత్వ శాఖలో పనిచేస్తూ అనుభవాన్ని సంపాదించాడు. అదే సమయంలో ఆయన కథాకథనాలపై పట్టు సాధించాడు. ఆ తరువాత తాను అనుకున్నట్టుగానే దర్శకుడిగా మారాడు. అలా మెగాఫోన్ పట్టుకుని ఆయన తెరకెక్కించిన 'వాలి' .. 'ఖుషి' సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలను గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారంటే అవి ఎంతగా ప్రభావితం చేశాయనేది అర్థం చేసుకోవచ్చు. అలా ఆయన దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్లాడు.

తాను అనుకున్న సమయం వచ్చిందని అనిపించగానే ఆయన నటన వైపుకు వచ్చాడు. కొంతకాలం పాటు దర్శకత్వం చేస్తూనే నటిస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత నటనపైనే పూర్తి దృష్టిపెట్టాడు. ముఖ్యంగా విలన్ పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆవేశం .. ద్వేషంతో రగిలిపోయే విలనిజం ఒక రకమైతే, మానసికంగా కాస్త తేడాగా ఉండే విలనిజాన్ని పండించడం మరో రకం. రెండవ తరహా విలన్ పాత్రలను పండించడంలో ఎస్.జె. సూర్య మంచి మార్కులను కొట్టేశాడు. అందుకు 'స్పైడర్' సినిమాలో ఆయన చేసిన పాత్రనే నిలువెత్తు నిదర్శనం.

ఇక అప్పటి నుంచి ఆయన విలన్ గా మరింత బిజీ అయ్యాడు. ఇటీవల శింబు హీరోగా వచ్చిన 'మానాడు' సినిమా కూడా విలన్ గా ఎస్.జె. సూర్యకి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లోని ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆయనకి  విలన్ రోల్ వెళ్లిందట. అయితే పారితోషికంగా ఆయన 7 కోట్లు అడగడంతో ఆ నిర్మాత బిత్తరపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇది రూమర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో సూర్యకి విలన్ గా ఇంకా అంత డిమాండ్ లేదు. కనుక ఆయన ఆ రేంజ్ లో అడిగే అవకాశం కూడా లేదు. ఇక ఆఫర్ ఇచ్చింది ఎవరు? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు కనుక, దీనిని గాసిప్ గానే అనుకోవాలి.     

  
Tags:    

Similar News