టాలీవుడ్ నెత్తిన డిజిట‌ల్ పిడుగు

Update: 2018-07-28 08:29 GMT
టాలీవుడ్ నెత్తిన ఇన్నాళ్లు జీఎస్టీ భారం మాత్ర‌మే ఉంద‌ని భావించాం. జీఎస్టీ పేరుతో ఏ టు జెడ్ అంతా ప‌న్నుల ప‌రిధిలోకి రావ‌డంతో ఆ మేర‌కు నిర్మాత‌ల‌పై తీవ్ర‌మైన భారం ప‌డింది. జీఎస్టీ ప్ర‌క‌ట‌న వేళ దీనిపై ఉద్య‌మాలు చేసినా కేంద్రం స్థాయిలో ప్ర‌క‌ట‌న కావ‌డంతో మ‌న నిర్మాత‌లెవ‌రూ ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇక టాలీవుడ్‌ నిర్మాత‌ల్లో ఉద్య‌మాల ప‌రంగా చిత్త‌శుద్ధి లేద‌న్న విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. ఓవైపు త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఎంతో యాక్టివ్‌ గా ఉండి ఉద్య‌మాలు చేప‌డితే - తెలుగు సినీనిర్మాతలు ఎవ‌రికి వారు ముడుచుకుని కూచున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కేవ‌లం జీఎస్టీ విష‌యంలోనే కాదు, డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల విష‌యంలోనూ సేమ్ సీన్ ఇక్క‌డ‌. దీనిపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అయితే మ‌న ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌ల మండ‌లి బాల్ గేమ్ పూర్తిగా డిఫ‌రెంట్ అన్న సంగ‌తి చాలా కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. ఇక్క‌డున్న‌న్ని రాజ‌కీయాలు ఇంకెక్క‌డా ఉండ‌వు. అయితే ఈ రాజ‌కీయాలేవీ తెలుగు సినీప‌రిశ్ర‌మ పురోభివృద్ధికి నామ‌మాత్రంగా కూడా ఉప‌యోగ‌ప‌డ‌వ‌ని అనుభ‌వ‌జ్ఞులు విశ్లేషిస్తున్నారు. ఏదైతేనేం.. ఈ స‌మ‌స్య‌ల‌కు ఇప్పుడు డిజిట‌ల్ స‌ర్వీస్‌ ప్రొవైడ‌ర్ (డిఎస్‌ పీ) స‌మ‌స్య అద‌న‌పు బ‌ర్డెన్‌ గా మారింద‌న్న‌ది నేడు ఫిలింఛాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో నిగ్గు తేల్చారు. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు నిర్మాత‌ల‌పై పెనుభారం మోపుతున్నార‌న్న వేద‌న చాలాకాలంగానే ఉంది. దీనిని వ్య‌తిరేకిస్తూ ఇదివ‌ర‌కూ త‌మిళ తంబీల‌తో క‌లిసి మ‌న నిర్మాత‌లు పెనుయుద్ధ‌మే చేశారు. అస‌లు ఈ యుద్దం ప్రారంభించిందే మ‌నోళ్లు. అయితే మ‌న నిర్మాత‌లు మ‌ధ్య‌లో వ‌దిలేసిన ఉద్య‌మాన్ని విశాల్‌లాంటి హీరో కం నిర్మాత త‌మిళ‌నాట పెద్ద రేంజుకు తీసుకెళ్లారు. అక్క‌డ ఏకంగా కొత్త డీఎస్‌పీల‌నే బ‌రిలోకి దించాడు విశాల్‌. త‌క్కువ ధ‌ర‌కు సాంకేతిక‌త‌ను అందించే డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఎంపిక చేసుకుని పాత ప్రొవైడ‌ర్ల‌కు పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చాడు. దీంతో ఎగ్జిబిట‌ర్ల‌కు ఊర‌ట ల‌భించింది. కానీ ఆ ప‌ని మ‌న తెలుగు నిర్మాత‌ల మండ‌లి చేయ‌లేక‌పోయింది. అయితే కొత్త గా ఫిలింఛాంబ‌ర్‌ అధ్య‌క్షుని ఎన్నిక వేళ ఈ స‌మ‌స్య‌ల్ని న్యూ క‌మాండ‌ర్‌ వీరినాయుడి దృష్టికి జ‌న‌ర‌ల్ బాడీ తీసుకొచ్చింది. దీంతో డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల స‌మ‌స్య‌ల‌పై తీవ్ర‌మైన చ‌ర్చ సాగింది. ఇక్క‌డ కూడా కొత్త స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను తీసుకొచ్చేందుకు ఫిలింఛాంబ‌ర్ కొత్త  అధ్య‌క్షుడు వీరినాయుడు హామీనిచ్చారు.
Tags:    

Similar News