పైరసీపై పోరు.. ఇప్పుడే గుర్తొస్తుందా?

Update: 2017-12-21 04:44 GMT
పైరసీ.. సినీ పరిశ్రమను ఎప్పట్నుంచో వేధిస్తున్న పెను భూతం. ఒకప్పుడైనా సీడీల ద్వారా పైరసీ విస్తరించడానికి కొంచెం సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా పైరసీ ప్రింట్లు ఈజీగా సర్క్యులేట్ అవుతున్నాయి. రిలీజైన మరుసటి రోజుకే మొబైళ్లలోకి వచ్చేస్తున్నాయి. దాని వల్ల సినిమాపై పడుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ నష్టం భారీగా ఉంటున్నప్పటికీ పైరసీ మీద సినీ పరిశ్రమ కలిసికట్టుగా.. గట్టిగా పోరాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా ఉండటం వల్ల పోరాట ఉద్ధృతి పెరగట్లేదన్నది వాస్తవం.

ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ పైరసీ గురించి మాట్లాడతాడు. ఆవేదన వ్యక్తం చేస్తారు. పైరసీ మీద పోరాడాలంటారు. కానీ అది వాళ్ల సినిమాలు విడుదలవుతున్నపుడు మాత్రమే జరుగుతుంది. మొన్న ‘జవాన్’ సినిమా రిలీజైనపుడు దర్శకుడు బీవీఎస్ రవి ప్రెస్ మీట్ పెట్టి పైరసీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ‘ఎంసీఏ’.. ‘ఒక్కక్షణం’ సినిమాలు రిలీజవుతున్న నేపథ్ంయలో దిల్ రాజు.. అల్లు శిరీష్ కలిసి వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది బాగానే ఉంది కానీ.. ఇలా తమ సినిమాలు విడుదలైనపుడు ఆయా చిత్రాలకు చెందిన వాళ్లు విడిగా వెళ్లి ఫిర్యాదులివ్వడం.. ఇంకేదైనా చేయడం వల్ల పైరసీ ఆగిపోతుందా.. అంటే సందేహమే. ఇలా ఎవరికి వారుగా సోలోగా వచ్చినపుడు పోలీసులు ఏమాత్రం సీరియస్ గా తీసుకుంటారు.. ఎంత చురుగ్గా పని చేస్తారు అన్నది చిత్ర నిర్మాతలకే అర్థమై ఉంటుంది. అలా కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి పైరసీని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించడం.. ప్రభుత్వం.. పోలీసుల మీద కూడా గట్టిగా ఒత్తిడి తేవడం అవసరం. అంతే తప్ప.. తమ సినిమాలు విడుదలైనపుడు ఆందోళన చెందడం.. మిగతా సమయాల్లో ఎవరికి వారన్నట్లుగా ఉంటే పైరసీపై పోరాటం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంటుంది.
Tags:    

Similar News