మ‌ణి సార్ సినిమాని దిల్‌ రాజు వ‌ద‌ల్లేదు

Update: 2016-08-15 07:00 GMT
ఓకే బంగారంతో మ‌ళ్లీ ఫామ్‌ లోకి వ‌చ్చాడు మ‌ణిర‌త్నం. ఆయ‌న సినిమా అంటే ఓ  క‌ళాఖండ‌మే. అందుకే  స‌క్సెస్ - ఫెయిల్యూర్ల‌తో సంబంధం లేకుండా మ‌ణిర‌త్నం సినిమాల్ని చూస్తుంటారు ప్రేక్ష‌కులు. ఎన్నో అపురూప‌మైన సినిమాల్ని చేసిన ఆయ‌న ఆమ‌ధ్య కొంత‌కాలం పాటు ఫామ్‌ని కోల్పోయారు. కొన్ని సినిమాలైతే పెట్టిన పెట్టుబ‌డిని కూడా వెన‌క్కి తీసుకురాలేదు. ఇక మ‌ణిర‌త్నం పనైపోయింద‌ని మాట్లాడుకొన్నారంతా.  కానీ `ఓకే బంగారం`తో మ‌ళ్లీ త‌న స‌త్తాని చాటాడు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు తీశాడ‌మో అనేంత‌గా లేటెస్ట్ ట్రెండ్‌ కి అద్దం ప‌డుతూ ఆ సినిమాని తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. దుల్క‌ర్ స‌ల్మాన్‌ - నిత్య‌మీన‌న్ జంట‌గా న‌టించిన ఆ చిత్రాన్ని తెలుగులో దిల్‌ రాజు విడుద‌ల చేసి,  భారీ లాభాల్ని ఆర్జించాడు. అందుకే మ‌రోసారి మ‌ణిర‌త్నం సినిమాని వ‌దిలిపెట్ట‌కుండా డ‌బ్బింగ్ రైట్స్‌ ని కొనుగోలు చేశాడు దిల్‌ రాజు.

ఓకే బంగారం త‌ర్వాత బాగా గ్యాప్ తీసుకొని కార్తితో సినిమా చేస్తున్నాడు మ‌ణి. ఓ పైల‌ట్ ప్రేమ‌క‌థ‌తో ఆ చిత్రం తెర‌కెక్కుతోంది. హిట్టు త‌ర్వాత మ‌ణి తీస్తున్న చిత్రం కావ‌డంతో ఆ సినిమాకోసం భారీగా పోటీప‌డ్డారు. అయితే ఆ రైట్స్ మాత్రం దిల్‌ రాజు చేతికి చిక్కాయి. ఆయ‌న‌కంటే ఎక్కువ రేటు చెల్లించి కొనేందుకు బండ్ల గ‌ణేష్ ముందుకొచ్చాడ‌ట‌. కానీ మ‌ణిర‌త్నం మాత్రం రైట్స్‌ని దిల్‌ రాజుకే ఇచ్చాడ‌ట‌. ఓకే బంగారం సినిమాని ప్ర‌మోట్ చేసిన విధానం న‌చ్చ‌డంతోనే మ‌ణిర‌త్నం త‌న కొత్త సినిమా రైట్స్‌ ని దిల్‌ రాజుకి ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News