రాజు గారూ.. మోసం చేశారండీ

Update: 2018-05-12 05:39 GMT
దిల్ రాజు సినిమా అంటే ఒక నాణ్యమైన బ్రాండ్ అన్నట్లే. ఆయన ఏ సినిమా తీసినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని.. ఏమీ లేని కథల్ని ఆయన ఓకే చేయరని ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. కొన్నిసార్లు రాజు జడ్జిమెంట్ కూడా తేడా కొట్టిన సందర్భాలున్నాయి కానీ.. మెజారిటీ సినిమాలతో హిట్లు కొట్టడం వల్ల ఆయన మీద ప్రేక్షకులకు ఉన్న భరోసా అలాగే నిలబడింది. రాజు నిర్మించే సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల్లో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని జనాలు నమ్ముతారు. కొన్నిసార్లు రాజు కేవలం నైజాం డిస్ట్రిబ్యూషన్ కు పరిమితం కాకుండా.. హోల్ సేల్ గా సినిమాను కొనేసి తన బేనర్లో రిలీజ్ చేస్తుంటారు. గతంలో అలా ‘పటాస్’.. ‘కుమారి 21 ఎఫ్’.. ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సినిమాలు రాజు చేతుల మీదుగా రిలీజై పెద్ద విజయాల్ని అందుకున్నాయి. అందుకే రాజు ఒక సినిమాను కొన్నాడంటే దానికి పాజిటివ్ బజ్ వస్తుంది.

కానీ ఈ మధ్య రాజు బయటి సినిమాల్ని ఇలా చేతుల్లోకి తీసుకుని చేతులు కాల్చుకుంటున్నాడు. గత ఏడాది కాలంలో ఆయన డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన చాలా సినిమాల ఫలితాలు తేడా కొట్టేశాయి. అలాగే ఆయన ఏకమొత్తంగా హక్కులు తీసుకుని విడుదల చేసిన సినిమాలూ అలాగే తయారవుతున్నాయి. ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’.. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు ఆ వరుసలోనివే. తాజాగా ‘మెహబూబా’ దిల్ రాజు క్రెడిబిలిటీని బాగా తీసేలా కనిపిస్తోంది.

ఇంతకుముందు రాజు రిలీజ్ చేసిన సినిమాల గురించి మరీ అతిగా చెప్పుకున్నదేమీ లేదు. కానీ ‘మెహబూబా’ గురించి మాత్రం ఊదరగొట్టేశారు. పూరి జగన్నాథ్ మనసు పెట్టి కథ రాస్తే వేరేలా ఉంటుందని.. ‘మెహబూబా’ విషయంలో అదే జరిగిందని.. పూరి నుంచి తాను ఆశించేది ఇదే అని చెబుతూ ఇదొక అద్భుతమైన సినిమా అన్నట్లు కలరింగ్ ఇచ్చారు రాజు.

ఆయన సినిమా బాగుంటే బాగుందన్నట్లు చెబుతారు కానీ.. మరీ ఈ రేంజిలో పొగడరు. రాజు ఇలా చెప్పేసరికి ‘మెహబూబా’పై చాలా ఆశలు పెట్టుకున్నారు జనాలు. పూరి ఈజ్ బ్యాక్ అంటూ ముందే తీర్మానాలు చేసేశారు. రాజు మాటల వల్ల ఈ చిత్రానికి కొంతవరకు హైప్ కూడా వచ్చింది. రాజు ఇలా మాట్లాడి సినిమాను తన చేతుల్లోకి తీసుకోవడాన్నే ‘మెహబూబా’ సక్సెస్ లాగా చూశారు చాలామంది. కానీ సినిమా చూశాక మాత్రం అందరూ షాకవుతున్నారు. ఈ సినిమా గురించా రాజు ఇంతలా చెప్పింది.. ఆయన టేస్టు ఇలా తయారైందేంటి అంటూ నిట్టూరుస్తున్నారు. రాజు జడ్జిమెంట్ ఫెయిలైందా.. లేక ఆయన కావాలనే ఇలా ఎక్కువ చేసి చెప్పి జనాల్ని మోసం చేశారా అన్న చర్చ నడుస్తోంది ప్రస్తుతం. ఈ సినిమాతో రాజు ఏం లాభం పొందుతున్నాడో ఏమో కానీ.. ఆయన విశ్వసనీయత మాత్రం బాగా దెబ్బ తినడం ఖాయం.

Tags:    

Similar News