ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తన 25వ చిత్రంలోనటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్... జనసేన కార్యక్రమాలు, రాజకీయ వ్యవహారాలపై ఫోకస్ చేయబోతున్నారు. అయితే, 2019 ఎన్నికలలోపు పవన్ ...పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ సినిమా చేయబోతున్నాడని వినికిడి. ఈ సినిమా ద్వారా రాబోయే ఎన్నికల్లో తన మైలేజ్ ను పెంచుకోవాలనే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. విలక్షణ దర్శకుడు క్రిష్ చెప్పిన కథ పవన్ కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గమ్యం - వేదం - కంచె వంటి సందేశాత్మక సినిమాలు తెరకెక్కించిన క్రిష్ తో సినిమా చేసేందుకు పవన్ కూడా సుముఖంగా ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడు నెలల్లో ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
కంచె సినిమాకు ముందే పవన్ తో సినిమా చేసేందుకు క్రిష్ ప్రయత్నించారట. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఓకే కాలేదట. ప్రస్తుతం క్రిష్ చెప్పిన కథ రాజకీయంగానూ తనకు లబ్ధి చేకూర్చేలా ఉండటంతో పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను క్రిష్ వేగంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో, పవన్ సినిమాను కూడా 3 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం క్రిష్...హిందీలో కంగనా లీడ్ రోల్ పోషిస్తోన్న మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక.. పవన్‌తో కలిసి సినిమా చేస్తారని తెలుస్తోంది. అయితే, త్రివిక్రమ్ సినిమా తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్ లో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో, క్రిష్ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మైత్రి మూవీస్ సినిమాకు బ్రేక్ పడే అవకాశముంది.