మారుతిపై బూతు ముద్ర తొల‌గిన‌ట్టే...!

Update: 2015-09-05 10:10 GMT
నిన్న‌టిదాకా బూతు సినిమాల ద‌ర్శ‌కుడు అన్న పేరుండేది మారుతికి. `ఈరోజుల్లో`, `బ‌స్‌స్టాప్‌` చిత్రాల్లో ఆ రేంజ్  ద్వంద్వార్థాలు ధ్వ‌నించాయి మ‌రి! ఆ సినిమాల త‌ర్వాత మారుతిపై తీవ్ర విమ‌ర్శ‌కులు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. యూత్ సినిమాల పేరుతో బూతును చూపిస్తున్నాడంటూ  ఆరోపించేవాళ్లు. ఫ్యామిలీ ఆడియెన్స్ మారుతి సినిమా అంటే దూరం దూరం అంటూ వెళ్లిపోయేవారు. ఆ ముద్ర ఎంత చెడు చేస్తుందో  గ్ర‌హించాడు మారుతి. క్ర‌మంగా త‌న దారిని మార్చాడు. `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌`, `కొత్త‌జంట‌`లాంటి క‌థ‌ల్ని క్లీన్‌ గా రాసుకొన్నాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఉండాలి క‌దా అన్న‌ట్టు అక్క‌డ‌క్క‌డ త‌న‌దైన మార్క్ బూతు డైలాగుల్ని ప‌లికించాడు. అవి విన్నాక మారుతి ఇక మార‌డు అన్న నిర్ణ‌యానికొచ్చేశారు ప్రేక్ష‌కులు. అయితే ఆయ‌న మాత్రం తాను మారానని నిరూపిస్తూ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` రూపంలో ఓ క్లీన్ సినిమాని తీశాడు. నిన్న‌నే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆ చిత్రం  కుటుంబంతా క‌లిసి హాయిగా చూసి న‌వ్వుకొనేలా  ఉంది. ఎక్క‌డా బూతు మాట‌లు వినిపించ‌లేదు.  మారుతిపై ఇక బూతు సినిమాల ద‌ర్శ‌కుడు అన్న ముద్ర తొల‌గించాల్సిందే అని చెప్ప‌క‌నే చెప్పింది. స్వ‌చ్ఛ‌మైన వినోదాన్ని పండించే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడిని అంటూ మారుతి త‌న‌ని తాను నిరూపించుకొనే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ ప్ర‌య‌త్నంలో విజ‌యం కూడా సాధించాడు. ఇక స్టార్ లు మారుతితో సినిమాలు చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌కుండా ముందుకొస్తార‌న్న‌మాట‌. అన్న‌ట్టు మారుతితో సినిమా చేయ‌డానికి వెంక‌టేష్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఇదివ‌ర‌కు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `రాధ‌` అనే సినిమా సెట్స్‌ పైకి వెళ్లిన‌ట్టే వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు వెంకీ కోసం మారుతి మ‌రో క‌థ‌ని సిద్ధం చేసుకొన్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News