ఫేస్ బుక్ పరిచయమే దర్శకుణ్ణి చేసింది

Update: 2016-02-18 15:30 GMT
అడవి శేష్ - ఆదాశర్మ జంటగా నూతన దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘క్షణం’. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యాంకర్ అనసూయ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి వైజాగ్ కు చెందిన ఇంజినీరింగ్ కుర్రాడు రవికాంత్ డైరెక్టర్. మూవీ ప్రమోషన్లో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు అడవి శేష్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. దాంతో నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరతా అని అడిగా. అయితే అడవి శేష్... ముందు ఇంజినీరింగ్ కంప్లీట్ చెయ్... ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలోకి వద్దువు గానీ అన్నారు. నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. అప్పటి నుంచి అడవి శేష్ తో రెగ్యులర్ గా టచ్ లో వుండే వాణ్ని. ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే కిస్ సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఇంకా అడవి శేష్ తో కలిసి పనిచేస్తున్నా. అలా ఏర్పడిన ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్పే ఇప్పుడు క్షణం మూవీకి నన్ను డైరెక్టర్ అయ్యేలా చేసింది’ అన్నారు.

ఇంకా మూవీ గురించి మాట్లాడుతూ ‘ఓ రోజు అడవి శేష్ కారులో వెళుతుంటే.. ఓ చిన్నారి లిఫ్ట్ అడిగింది. వెంటనే అడవి శేష్ లో ఓ థాట్ వచ్చింది. ఇంత చిన్న అమ్మాయి లిఫ్ట్ అడుగుతోంది. ఒక వేళ ఎవరైనా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఎలా? అనే ఆలోచన నుంచే ‘క్షణం’ మూవీ స్క్రిప్ట్ రెడీ అయింది. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. రెండు గంటల నిడివి గల ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా అనసూయ క్యారెక్టర్ చాలా బాగా వుంటుంది. దాదాపు నెల రోజుల పాటు.. ఆమె ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ట్రైనింగ్ తీసుకుని నటించింది. తప్పకుండా అనసూయకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ఆమెది. చిన్నారి డాలీ కూడా బాగా నటించింది. నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సఖిలాంటి సినిమా తీయాలనేది నా కోరిక. నా తదుపరి చిత్రం తప్పకుండా లవ్ స్టోరీ మూవీనే’ అన్నారు.​
Tags:    

Similar News