ఏ హీరో ఒప్పుకోని పాత్ర కోసం ముందుకొచ్చిన రానా!

Update: 2022-06-13 04:54 GMT
రానా - సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల 'విరాటపర్వం' సినిమాను రూపొందించాడు. సురేశ్ బాబు .. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 17వ  తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఆత్మీయ వేడుక'లో వేణు మాట్లాడుతూ .. "ఏ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్నిజ్వాలలై మండుతాయో .. ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యాలై పుడతాయో .. ఆ ప్రాంతమే ఓరుగల్లు. అలాంటి ఈ ప్రాంతంలో 1992లో జరిగిన ఒక మరణం నన్ను కదిలించి వేసింది . ఒక మహా సంక్షోభం నన్ను ఆలోచింపజేసింది.

ఆ మరణం వెనుక ఆధిపత్య రాజకీయ పోరాటాలు ఉన్నాయి. దాంతో ఆ కథను నేను సినిమాగా తెరపైకి తీసుకు రావాలని అనుకున్నాను. ఆ కథకు  అందమైన ప్రేమను జోడించి ఒక మహా కావ్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను ..  అదే 'విరాటపర్వం'.

ఈ కథ రాస్తున్నప్పుడే వెన్నెల అనే పాత్ర  లంగావోణి ధరించి .. సంచీ తగిలించుకుని .. డైరీ పట్టుకుని నా కలలోకి వస్తుండేది.  ఆమెది మామూలు స్త్రీ  ప్రేమ కాదు .. శివుడిని ప్రేమించిన సిద్ధేశ్వరీ లాంటింది. అలాంటి పాత్రలో సాయిపల్లవి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మట్టి ముద్దను కూడా బాంబులా తయారు చేసే పాత్రలో మా రానాగారు నటించారు. ఆయన ఈ సినిమాను ఒప్పుకోవడం నా గొప్పతనం కాదు .. అది ఆయన గొప్పతనం. వెన్నెల కథలో ఆయన భాగమయ్యాడు.

ఏ హీరో కూడా అలా చేయడానికి ఒప్పుకోడు. కానీ ఇది ఒక మంచి సినిమా .. తప్పకుండా దీనిని ముందుకు తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో  ఆయన ముందుకు వచ్చారు. రానా రాకతో ఈ సినిమా స్పాన్  పెరిగిపోయింది. ఇందులో ముఖ్యమైన ఎనిమిది పాత్రలలో ఐదు పాత్రలను స్త్రీలు పోషించారు. అందువలన ఇది స్త్రీలు చూడవలసిన సినిమా..

ఈ సినిమా పాండమిక్ ను చూసింది .. ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. అయినా థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతో వెయిట్ చేస్తూ వచ్చారు. అందుకు వాళ్లందరికీ నేను కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తుంది .. తప్పకుండా చూడండి.  ఈ సినిమా ఆనందింపజేస్తుంది .. ఆలోచింపజేస్తుంది"  అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News