డీజే టిల్లు అస‌లు టెస్ట్ పాస‌య్యాడోచ్‌

Update: 2022-02-15 06:46 GMT
చిన్న సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కంటెంట్ న‌చ్చితే చాలు స్టార్ సినిమానా చిన్న హీరో సినిమానా అని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. క్యారెక్ట‌ర్‌, క‌థ‌, క‌థ‌నాలు న‌చ్చితే లాజిక్ ల‌తో సంబంధం లేకుండా సినిమాని ఎంజాయ్ చేస్తూ ప్రోత్స‌హిస్తున్నారు.

తాజాగా గ‌త శ‌నివారం విడుద‌లైన `డీజే టిల్లు` విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన ఈ  చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.

విమ‌ల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించింది. రిలీజ్‌కి ముందే టీజ‌ర్, ట్రైల‌ర్ తో పాటు హీరోయిన్ పుట్టు మ‌చ్చ‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మార‌డంతో ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో ఓపెనింగ్స్ ఊహించ‌ని స్థాయిలో వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో ఏ చిన్న చిత్రానికి రాని ప్రారంభ వ‌సూళ్లు తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ ల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో ల‌భించ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు. ఓవ‌ర్సీస్ లో ఏర్పాటు చేసిన ప్రీమియ‌ర్ ల ద్వారా 100 కె (ల‌క్ష డాల‌ర్లు) రావ‌డం విశేషం.

ఈ మూవీకి ల‌భించిన ఓపెనింగ్స్ వ‌ల్ల హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ కు క్రేజ్ పెరిగింది. అయితే సినిమా ఓపెనింగ్స్ కే ప‌రిమిత‌మా... ఈ హ‌వాని ఇలాగే మ‌రో రెండు మూడు వారాల పాటు కొన‌సాగిస్తుందా? అనే అనుమానాలు ట్రేడ్ వ‌ర్గాల్లో మొద‌ల‌య్యాయి.

అంతే కాకుండా `డీజే టిల్లు` వీకెండ్ త‌రువాత మండే టెస్ట్ ని పాస‌వుతాడా? అని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఓపెనింగ్స్ వ‌ర‌కే త‌న క్రేజ్ ని ప‌రిమితం చేయ‌ని `డీజే టిల్లు` అదే జోష్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రింత సంద‌డి మొద‌లుపెట్టాడు. దీంతో మండే టెస్ట్ పాస‌య్యాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

శ‌ని, ఆదివారాలు భారీ ప్ర‌భావాన్ని చూపించినా కీల‌క‌మైన మండే టెస్ట్ ని `డీజే టిల్లు` పాస‌య్యాడ‌ని,  మ‌రో రెండు వారాల పాటు ఇదే హ‌వాని కొన‌సాగించ‌బోతున్నాడ‌ని, అందులో ఎలాంటి డౌట్ లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త కొంత కాలంగా ఇలాంటి విజ‌యం కోస‌మే ఎదురుచూస్తున్న హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ తాజా రిజ‌ల్ట్ తో ఖుషీగా వున్నాడ‌ట‌. ఈ సినిమాతో అత‌ని కెరీర్ మ‌రో స్థాయికి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని, మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ని సిద్దూ ద‌క్కించుకుంటాడ‌ని, త‌న స్థాయి కూడా ఈ సినిమా పెంచింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News