ఏంటీ దారుణం.. 'ట్రిపుల్ ఆర్' క్రెడిట్ వారికా?

Update: 2022-06-08 07:30 GMT
ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ చిత్రం `బాహుబ‌లి`. ఈ మూవీతో తెలుగు అంటే ప్ర‌పంచ సినిమా ఆశ్చ‌ర్యంతో చూసేలా చేశారు. తెలుగు సినిమాకు స‌రికొత్త క్రేజ్ ని, మార్కెట్ ని క‌ల్పించారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ సాధించిన వ‌సూళ్లు.. చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమాకు కీర్తి ప్ర‌తిష్ట‌ల్ని తెచ్చిపెట్టింది. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా మాత్రం `బాహుబ‌లి` ఆ స్థాయిలో పాపుల‌ర్ గా మార‌లేకపోయింది.

యుఎస్ లో బ‌జ్ క్రియేట్ అయినా విదేశీయుల నుంచి `బాహుబ‌లి`కి ద‌క్కిన ఆద‌ర‌ణ చాలా త‌క్కువే అని చెప్పాలి. ఓవ‌ర్సీస్ లో `బాహుబ‌లి` భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందంటే అది మ‌న వాళ్ల వ‌ల్లే కానీ విదేశీయులు మాత్రం మ‌న సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌టానికి ఆస‌క్తిని చూప‌లేదు. అయితే జ‌పాన్ లాంటి  దేశాల్లో మాత్రం ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే `ట్రిపుల్ ఆర్` మాత్రం అందుకు భిన్నంగా విదేశీయుల నుంచి కూడా మంచి ప్ర‌శంస‌ల‌తో పాటు ఆద‌ర‌ణ పొందుతోంది.

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన మూవీ ఇది. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ మార్చిలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇత‌ర దేశాల్లోనూ విదేశీయులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం కూడా చేశారు. అమెరిక‌న్ లు సైతం ఈ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రిపుల్ ఆర్ ఓ అద్భుత‌మైన సినిమా అని, దీన్ని త‌ప్ప‌కుండా అంతా చూడాల‌ని ప్ర‌చారం చేశారు. ఇప్ప‌టికీ చేస్తున్నారు.

ఈ మూవీ ఇటీవ‌లే ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూసిన వారంతా సినిమా అద్భుతంగా వుంద‌ని ఎగ్జైట్ అవుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసినా నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీకి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. విదేశీయులు ఈ మూవీపై ఊహించ‌ని విధంగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ న‌టుడు ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప్ర‌చారం చేయ‌గా.. తాజాగా హాలీవుడ్ క్రేజీ మూవీ `డాక్ట‌ర్ స్ట్రేంజ్‌` ఫిల్మ్ ర‌చ‌యిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఈ మూవీని encoRRRe మ‌ళ్లీ విడుద‌ల చేశారు. రెస్పాన్స్ అద్భుతంగా వుంది. హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలో ట్రిపుల్ ఆర్ థియేట‌ర్ల వ‌ద్ద క్రేజ్ క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమా స‌క్సెస్ క్రెడిట్ ని మాత్రం బాలీవుడ్ ఖాతాలో వేస్తున్నార‌ట‌.

ఇండియ‌న్ సినిమాలంటే విదేశీయుల్లో బాలీవుడ్ సినిమా అనే అపోహ వుంది. అదే ట్రిపుల్ ఆర్ క్రెడిట్ ని బాలీవుడ్ ఖాతాలో వేస్తోంద‌ట‌. ఇది తెలుగు సినియా అని తెలియ‌క హిందీ వెర్ష‌న్ చూస్తున్న వారు మాత్రం ఇది బాలీవుడ్ మూవీ అంటూ ప్ర‌శంస‌లు గుప్పిస్తుండ‌టం మ‌న వాళ్ల‌కు చిరాకు పుట్టిస్తోంది.
Tags:    

Similar News