‘బ్రహ్మోత్సవం’ బంపరాఫర్ అందరికీ ఉంటుందా?

Update: 2016-07-12 11:33 GMT
గతంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు కొన్ని నగరాలు.. పట్టణాల్లో మాత్రమే బెనిఫిట్ షోలు వేసేవాళ్లు. టికెట్ రేటు మామూలుగా 50 రూపాయలుంటే.. ఆ షోకు వందో నూట యాభయ్యో పెట్టి టికెట్లు అమ్ముకునేవాళ్లు. ఐతే గత రెండు మూడేళ్లుగా ఓ జాఢ్యం మొదలైంది. బెనిఫిట్ షోల పేరు చెప్పి భారీగా డబ్బులు దండుకునే ముఠాలు కొన్ని తయారయ్యాయి.

పోలీస్ డిపార్ట్ మెంట్ అనుమతి కోసం ఓ మూడు వేలు పడేయడం.. అర్ధరాత్రో.. తెల్లవారుజామునో బెనిఫిట్ షో పేరు చెప్పి టికెట్ రేటు వెయ్యి రెండు వేలు పెట్టి అమ్మడం.. భారీగా డబ్బులు దండుకోవడం.. ఇలా తయారైంది వరస. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి దోపిడీ ముఠాలు బాగా పెరిగిపోయాయి. కొన్ని పేరుమోసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా ఈ దోపిడీకి తెగబడ్డం ప్రారంభించాయి. ఇది బాగా లాభసాటిగా మారడంతో పోటీ కూడా ఎక్కువైంది. ఐతే తెలంగాణ పోలీసులు కాస్త ఆలస్యంగా అయినా మేల్కొని ఈ దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ‘సరైనోడు’ దగ్గర్నుంచి బెనిఫిట్ షోల దోపిడీకి అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ సహా అన్ని తెలంగాణ నగరాల్లో బెనిఫిట్ షోలు ఆగిపోయాయి.

ఐతే స్టార్ హీరోల సినిమాల్ని సాధారణ ప్రేక్షకుల కంటే కొంచెం ముందు చూడాలని అభిమానులు ఆశించడం సహజం. అలాంటి వాళ్లకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. ఐతే ఆ మధ్య తెలంగాణ వ్యాప్తంగా ఐదో షోకు అనుమతివ్వాలన్న ఓ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగానో ఏమో ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు తొలి రోజు ఉదయం 8 గంటలకే అదనంగా ఓ షో వేసుకునే అవకాశం కల్పించారు. సినిమాకు మంచి టాక్ వచ్చి ఉంటే.. ఇది నిర్మాతకు చాలా కలిసొచ్చుండేది. కానీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

ఐతే బ్రహ్మోత్సవం సినిమాకు కల్పించిన ఆ సౌలభ్యాన్ని మిగతా పెద్ద సినిమాలకు కూడా అనుమతించాలని కోరుతున్నారు. కబాలి.. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకు అదనపు షోకు అవకాశమిస్తే అది నిర్మాతలకూ మంచిదే. అభిమానులకూ ఆనందాన్నిచ్చేదే. ఈ షోకు సాధారణ టికెట్ రేట్లే ఉంటాయి కాబట్టి అభిమానులపై భారం పడదు. ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. నిర్మాతలకూ మేలు జరుగుతుంది. మరి అన్ని పెద్ద సినిమాలకూ ఈ సౌలభ్యం కల్పిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News