మెహ్రీన్ కథ కంచికి చేరినట్టేనా?

Update: 2020-02-03 06:54 GMT
పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ కెరీర్ మొదట్లో బాగానే సాగింది. తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' తో మంచి గుర్తింపు సాధించింది. తర్వాత 'మహానుభావుడు'.. 'రాజా ది గ్రేట్' సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే వెంటనే స్టార్ట్ అయింది పరాజయాల పరంపర. దాదాపు అరడజను ఫ్లాపులతో డీలా పడి పోయింది. సరిగ్గా ఆ సమయంలో 'F2' తో బ్లాక్ బస్టర్ సాధించింది. హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అయింది. ఇక మెహ్రీన్ కు దిగుల్లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.

గోపిచంద్ సినిమా 'చాణక్య' లో మెహ్రీన్ హీరోయిన్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెహ్రీన్ తన ఆశలన్నీ సంక్రాంతికి రిలీజ్ అయిన 'ఎంత మంచివాడవురా' పై పెట్టుకుంది. అయితే ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక జనవరి 31 న రిలీజ్ అయిన 'అశ్వథ్థామ' తనకు సూపర్ హిట్ అందిస్తుందని అనుకుంటే ఆ అశలు కూడా తీరేలా కనిపించడం లేదు. సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి.

ఇలా వరసగా సినిమాలు నిరాశపరుస్తూ ఉండడంతో మెహ్రీన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ కు చేతిలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఆఫర్ లేదు. ఇకపై క్రేజీ ఆఫర్లు దొరకడం కష్టమేనని కూడా టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి మెహ్రీన్ బయటకు రాగలుగుతుందా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News