ఈ రోజు ఉదయం నుంచి మీడియాలో ఒకటే గోల గగ్గోలు! మెగాస్టార్ `సైరా` సెట్స్ ని రెవెన్యూ అధికారులు పడగొట్టేశారు. పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లు తెచ్చి అడ్డంగా కూలదోసేశారట. ఇక షూటింగ్ ఆగిపోయినట్టే!! అంటూ ఒకటే ఊకదంచేశారు. అయితే ఈ దంపుడులో కొంత నిజం. కొంత అబద్ధం వేగంగా ప్రచారం అయిపోయింది. అసలు ఈ సెట్ కూల్చివేత వెనక అసలు నిజం ఏది? అంటే.. అసలు కథే వేరే ఉందన్నది తాజాగా కొణిదెల కాంపౌండ్ నుంచి ఓ లీక్ అందింది.
వాస్తవానికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు పడగొట్టిన సెట్ లో షూటింగ్ అప్పటికే పూర్తయింది. ఇక తర్వాతి షెడ్యూల్ ఈనెల 5 నుంచి రామోజీ ఫిలింసిటీలో ఉంటుంది. ప్రస్తుతం ఆ సన్నాహాల్లో యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. ఆర్ ఎప్ సీలో ఆగస్టు 12 వరకూ 7రోజుల పాటు షెడ్యూల్ చేస్తారు. అటుపై టీమ్ యూరప్ కి ప్రయాణం అవుతుంది. అక్కడ భారీ వార్ సన్నివేశాలు తెరకెక్కిస్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ బోయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇదీ అసలు వాస్తవం. అసలు ఆ సెట్‌తో ఇక పనేమీ లేదు అనుకున్న తర్వాతనే దానిని రెవెన్యూ అధికారులు పడగొట్టారు. సైరా చిత్రం సంక్రాంతికి కాదు సమ్మర్ కి వచ్చే ఛాన్సుందన్నది వేరొక సమాచారం. అదీ సంగతి.