#రాధేశ్యామ్.. ఇంత వెన‌క‌బాటు దేనికి మ‌హా ప్ర‌భో!

Update: 2021-11-10 06:39 GMT
2022 సంక్రాంతి బ‌రిలో అంత‌కుముందే క్రిస్మ‌స్ బ‌రిలో దిగుతున్న చాలా సినిమాల‌తో పోలిస్తే రాధేశ్యామ్ ప్ర‌చారం వీక్ గా ఉందా? అంటే అవున‌నే ప్ర‌భాస్ అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. డార్లింగ్ నుంచి వ‌రుస ట్రీట్ ని ఆశిస్తే అస్స‌లు ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ని ఓపెన్ చేయ‌కుండా దాచేస్తున్నార‌ని ఫిర్యాదు చేస్తున్నారు ఒక సెక్ష‌న్ అభిమానులు.

ఓవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ .. మ‌హేష్‌.. బ‌న్ని లాంటి స్టార్లు ప్ర‌చారం ప‌రంగా స్పీడ్ గా ఉన్నారు. అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ భీమ్లా నాయ‌క్ ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వేగంగా పూర్తి చేస్తూనే ప్ర‌చారం అద‌ర‌గొడుతున్నారు. మ‌రోవైపు స‌ర్కార్ వారి పాట కోసం మ‌హేష్ ప్ర‌చారం చూస్తున్న‌దే. ఇవి రెండూ రాధేశ్యామ్ కి సంక్రాంతి బ‌రిలో తీవ్ర పోటీనివ్వ‌నున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న సినిమా పుష్ప‌ని ఒక రేంజులో ప్ర‌చారం చేసుకుంటున్నారు. పుష్ప కాస్త ముందుగానే క్రిస్మ‌స్ కానుక‌గా బ‌రిలో దిగుతుందన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప హిట్ట‌యితే సంక్రాంతి సెల‌వుల్లోనూ ఆడే వీలుంటుంద‌ని అంచ‌నా.

అయితే జనవరి 14న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన రాధేశ్యామ్ టీమ్ ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌ను రిలీజ్ చేయ‌క‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేస్తోంది. నిజానికి రాధే శ్యామ్ మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. టీజర్ లోనూ ఏదీ పెద్దగా రివీల్ చేయలేదు. పాటలు ఇంకా బయటకు రాలేదు. మ‌రి వీట‌న్నిటికీ ఈ కొద్ది రోజుల స‌మ‌యం స‌రిపోతుందా అన్న‌ది చూడాలి. ఇంత తక్కువ సమయం ఉండటంతో మేకర్స్ చాలా వెనుకబడి ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో నిర్వేదం క‌నిపిస్తోంది. అయితే ప్ర‌భాస్ రాధేశ్యామ్ ని పాన్ ఇండియా కేట‌గిరీలో ప్ర‌మోట్ చేయాల్సి ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టు ఈ రెండు నెల‌ల కాలాన్ని ప్ర‌మోష‌న్స్ కోసం డిజైన్ చేయాల్సి ఉంటుంది.

ప్రేమ‌క‌థ లో ప్రభాస్ ని చూసుకోవాలని..!

రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్ దాదాపు 11ఏళ్ల త‌ర్వాత ప్రేమికుడిగా మారారు. ఇన్నాళ్లు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో అల‌రించిన డార్లింగ్ ఈసారి వీర ప్రేమికుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్ని స్ప‌ర్శించ‌నున్నాడు. రాధేశ్యామ్ ప్రేమ‌క‌థ ఆద్యంతం ట్విస్టుల‌తో రంజింప‌జేయ‌నుంద‌ని స‌మాచారం. 1970-90 కాలం నాటి ల‌వ్ స్టోరీతో సాగే పీరియాడిక్ చిత్రమిది. చిత్రీక‌ర‌ణ అంతా ఆ కాలానికి సంబంధించిన ప్ర‌త్యేక‌మైన సెట్ల‌లో సాగింది. అయితే ప్ర‌ధానంగా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీ..రోమ్..వెనీస్ వంటి అంద‌మైన న‌గ‌రాల్లో జ‌రిగింది. ఇంకా ఇండియాలో షూట్ ని ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో..నాటి హెరిటేజ్ క‌ల్చ‌ర్ ని స్ఫురించే అన‌వాళ్ల మ‌ధ్య‌నే జ‌రిపారు.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ కావ‌డంతో యూనిట్ ఆ న‌గ‌రాల్ని.. ప్ర‌దేశాల్ని టార్గెట్ గా చేసి చిత్రీక‌ర‌ణ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలుస్తాయ‌ని యూనిట్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఇంత‌కీ ఇట‌లీ..రోమ్ లాంటి న‌గ‌రాల్ని ప్ర‌త్యేకంగా ఎందుకు? టార్గెట్ చేసిన‌ట్లు అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. ఇట‌లీ..రోమ్ వంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 1970-90 కాలం నాటి అన‌వాళ్లు ఉన్నాయి. చ‌రిత్ర పుట్ట‌ల్లోకి వెళ్తే ఆ న‌గ‌రాల గొప్ప‌త‌నం ఎంతో ఉంది. స‌హ‌జంగానే అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ న‌డుమ విదేశీయులు చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను క‌ప్పిపుచ్చ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు.

ఆయా ప్ర‌దేశాల్ని టూరిస్ట్ ప్లేస్ లుగా.. మ్యూజియ‌మ్ లు గా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు త‌ప్ప‌..ప్ర‌సిద్ధ‌ క‌ట్ట‌డాల్ని కూల‌దోయ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు. అలాంటి గొప్ప‌ద‌నం ఇట‌లీ..రోమ్.. వెనీస్ న‌గ‌రాల్లో ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది. అందుకే ఆ న‌గ‌రాల్ని ఇప్ప‌టికీ సుంద‌ర న‌గ‌రాలుగా పిలుచుకుంటారు. అనాదిగా వ‌స్తోన్న సంస్కృతి ఇప్ప‌టికీ కొన్నిచోట్ల‌ ప్ర‌పంచ న‌గ‌రాల్లో అంత‌రించిపోయినా ఇట‌లీలో వాడుక‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఇటలీ నేప‌థ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అవ‌సరం అనుకున్న చోట సెట్లు నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

ఇట‌లీ అందాల్ని సాధార‌ణ కెమెరాలో బందీ చేస్తేనే ఎంతో అద్భుతంగా క‌నిపిస్తాయి. అలాంటిది దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో పూర్తిగా ఇట‌లీ నేప‌థ్యాన్నే ఎంచుకున్నారంటే అక్క‌డి అందాల్ని ఇంకెంత ర‌మ‌ణీయ‌తతో చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్- టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News