రాజమౌళి గొప్పదనం ఏంటో చెప్పిన ఫైట్ మాస్టర్స్..!

Update: 2021-07-02 00:30 GMT
భారతీయ సినిమా ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో దర్శకధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. ప్రతీ సన్నివేశాన్ని పర్ఫెక్ట్ గా తీయాలని తపిస్తుంటారు. ఈ క్రమంలో నటీనటులు టెక్నిషియన్స్ నుంచి బెస్ట్ ఔట్ పుట్ రాబడుతుంటారు. రాజమౌళి తో కలసి కొన్ని సినిమాలకు వర్క్ చేసిన ఫైట్ మాస్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిగతా దర్శకులకు భిన్నంగా ఆయనకు ఉండే లక్షణాల గురించి వెల్లడించారు.

''రాజమౌళి దర్శకుడు కాకముందే 'ఇడియట్' సినిమాలో ఫైట్స్ చూసి మమ్మల్ని అభినందించారు. డైరెక్టర్ అయితే మీకు సినిమా ఇస్తానన్నారు. 'స్టూడెంట్ నెం.1' సినిమా అప్పుడు పిలిచారు. కొన్ని కారణాల వల్ల అది పీటర్ హెయిన్స్ కు వెళ్ళింది. ఆ తర్వాత 'సింహాద్రి' సినిమా కథ చెప్పారు. మేమప్పుడు యాక్టింగ్ లో బిజీగా ఉండటం వల్ల డ్రాప్ అయ్యాం. అయినా సరే 'సై' 'విక్రమార్కుడు' 'మగధీర' సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు'' అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు. ''భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి. కొందరు దర్శకులకు ఎమోషన్స్ మీద.. మరికొందరికి కామెడీ మీద.. ఇంకొందరికి సాంగ్స్ మీద గ్రిప్ ఉంటుంది. కానీ రాజమౌళి కి అన్నిటి మీద పట్టు ఉంటుంది. ఆయన ఇన్వాల్వ్ మెంట్ లేని సీన్ ఒక్కటి కూడా మనం చూడలేం. తనకు ఏది కావాలో దాని కోసం స్ట్రాంగ్ గా నిలబడతారు. అలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం గర్వకారణం'' అని అన్నారు.

'విక్రమార్కుడు' ఇంటర్వెల్ ఫైట్ తామే కంపోజ్ చేసినప్పటికీ.. అందులో 1% మాత్రమే తమకు క్రెడిట్ దక్కుతుందని.. మిగతా 99% రాజమౌళికి చెందుతుందని ఫైట్ మాస్టర్ ద్వయం తెలిపారు. ప్రతిరోజూ అందరి కంటే ముందు రాజమౌళి సెట్స్ కి వచ్చేవారని.. చిన్న చెట్టు దగ్గర నుంచి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడని వెల్లడించారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేసే అవకాశం వచ్చిందని.. పది రోజులు దాని మీద డిస్కషన్స్ కూడా జరిగాయని.. కరోనా కారణంగా డేట్స్ ఇష్యూ రావడంతో ఆ ఫైట్ చేయలేకపోయామని రామ్-లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News