శివరాత్రి సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

Update: 2021-03-18 17:30 GMT
మహా శివరాత్రి కానుకగా గత శుక్రవారం మూడు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వేటికవే ప్రత్యేకమైన 'శ్రీకారం' 'జాతిరత్నాలు' 'గాలి సంపత్' సినిమాలు ఒకే రోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి రివ్యూస్ రాబట్టాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేవలం ఒక్క సినిమా మాత్రమే సత్తా చాటిందని తెలుస్తోంది. ఫస్ట్ వీక్ లో ఈ మూడు సినిమాల వసూళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇటీవల కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్దగా రాకపోవడంతో ఆడియన్స్ 'జాతిరత్నాలు' సినిమాని ఎగబడి చూస్తున్నారు. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే ఆధిపత్యం చూపించింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 23.09 కోట్లు షేర్, రూ. 36.90 కోట్ల గ్రాస్‌ ను రాబట్టింది. ఇక కర్నాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు.. ఓవర్సీస్‌ లో రూ. 3.43 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 'జాతిరత్నాలు' మొదటి వారంలో రూ. 27.70 కోట్లు షేర్‌ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్‌ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారంలోనే బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ ను పూర్తి చేయడమే కాకుండా సుమారు 16 కోట్లు లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచింది.

వర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన ''శ్రీకారం'' సినిమా ఫస్ట్ డే మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ.. అది వారాంతం వరకూ కొనసాగలేదనని తెలుస్తోంది. వ్యవసాయం నేపథ్యంలో సందేశాత్మక అంశాలతో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు 4 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే రెండో రోజు నుంచి వసూళ్ళు బాగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'శ్రీకారం' ఫస్ట్ వీక్ లో దాదాపు 8.44కోట్ల షేర్ తో 14.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో 9.13 కోట్ల షేర్ ను, 15.50 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి. రెండో వారంలో అడుగుపెడుతున్న ఈ సినిమా కొత్త చిత్రాలను తట్టుకొని ఏ మాత్రం కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ - టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో అనిష్ కృష్ణ తెరకెక్కించిన 'గాలి సంపత్' సినిమా తొలి రోజు పర్వాలేదనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ తర్వాత రోజు నుంచి మిగతా రెండు సినిమాలతో పోటీ పడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 84 లక్షలు రాబట్టిన 'గాలి సంపత్'.. కర్నాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 లక్షలు.. ఓవర్సీస్‌ లో రూ. 8 లక్షలు మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ. 97 లక్షలు షేర్ తో 1.70 కోట్లు గ్రాస్‌ ను మాత్రమే ఈ సినిమా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.







Tags:    

Similar News