‘లవ్ స్టోరీ’ రిలీజ్ తో ఇండస్ట్రీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందా?

Update: 2021-09-20 10:39 GMT
అగ్ర హీరోలు నటించిన సినిమా కాదు. భారీ బడ్జెట్ మూవీ అంతకంటే కాదు. ఆ మాటకు వస్తే పాన్ ఇండియా చిత్రం కూడా కాదు. కానీ.. ఈ సినిమా కోసం హోల్ ఇండస్ట్రీ ఊపిరి బిగబెట్టి చూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఆ సినిమా ఏదంటారా? ఫీల్ గుడ్ మూవీలు తీసే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కరోనా రెండో వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదేనని చెప్పాలి.

మొదటి వేవ్ తర్వాత విడుదలైన రవితేజ ‘క్రాక్’ మూవీ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. తమ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ప్రేక్షకులు తేల్చేశారు. మొదటి వేవ్ తర్వాత వచ్చి పడిన సెకండ్ వేవ్ తో జరిగిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ అనుకున్నంత తీవ్రంగా లేకపోవటంతో.. థియేటర్లకు రావటానికి పెద్ద సంకోచం వ్యక్తం కాలేదు. కానీ.. కరోనా విశ్వరూపం ఎలా ఉంటుంది? ఈ మహమ్మారి ఎంత తీవ్రమైనదన్న విషయం సెకండ్ వేవ్ స్పష్టం చేసింది.

సెకండ్ వేవ్ చాలామంది మైండ్ సెట్ ను మార్చటమే కాదు.. కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని.. అమితమైన జాగ్రత్తతో ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కారణంగానే.. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా చెప్పినప్పటికీ.. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే సాహసం యజమానులు చేయలేదు.. సినిమాల్ని విడుదల చేసే ఆలోచన నిర్మాతలు చేయలేదు.

దీనికి తోడు.. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గినా.. ఏపీలో మాత్రం తగ్గకపోవటం.. థియేటర్ల ఓపెన్ కు తెలంగాణ ప్రభుత్వం ఓకే చేసినా.. ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉండటంతో తెలంగాణలోనూ థియేటర్లు ఓపెన్ కాలేదు. దీనికి తోడు తెలుగు సినిమాకు మార్కెట్ ఉన్న బెంగళూరు.. చెన్నై నగరాల్లో థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో.. సినిమాల్ని విడుదల చేస్తే.. ఆ కలెక్షన్లను మిస్ అవుతామన్న ఆలోచనతో నిర్మాతలు పలువురు ఆగిపోయారు.

లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రారంభం నుంచి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు.. ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ కావటం.. సారంగదరియా పాటకు ఏకంగా 32 కోట్ల వ్యూస్ రావటం మామూలు విషయం కాదు. ఇలా ఈ సినిమాలోని పాటలకు కోట్లాది వ్యూస్ రావటం.. ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు ప్రతిరూపంగా చెబుతున్నారు.

అలాంటి సినిమా విడుదలైన వేళ.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల జోరుతో రానున్న రోజుల్లో పెద్ద సినిమా విడుదల విషయంలో కీలక నిర్ణయానికి అవకాశం ఉందని చెప్పాలి. అందుకే.. భారీ బడ్జెట్ మూవీ కానప్పటికీ.. ఈ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మనోబలాన్ని ఇవ్వటమే కాదు.. కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయం. అందుకు భిన్నంగా పరిణామాలు ఉంటే మాత్రం.. దాని ఎఫెక్టు ఇండస్ట్రీ మొత్తం మీదా పడుతుందని చెప్పక తప్పదు. ఈ కారణాలే లవ్ స్టోరీ మూవీని మిగిలిన సినిమాలకు భిన్నమైన కోణంలో చూస్తున్నారు. ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ఈ మూవీ చెప్పేస్తుందన్న మాటల్లో వాస్తవం ఉందని చెప్పక తప్పదు.



Tags:    

Similar News