టాక్సీవాలాను వదిలేశారు..దీన్ని ఫిక్స్ చేశారు

Update: 2018-07-03 07:20 GMT
‘అర్జున్ రెడ్డి’తో యువతలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా వచ్చి పది నెలలవుతున్నా విజయ్ నటించిన కొత్త సినిమా ఏదీ విడుదల కాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే రెండు నెలల కిందటే ‘టాక్సీవాలా’ రావాల్సింది. కానీ అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడిపోయింది. మే నుంచి జూన్‌ నెలకి.. జూన్ నుంచి జులైకి సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ నెలలో కూడా సినిమా వచ్చేలా లేదు. దాని సంగతి ఎటూ తేల్చకుండా.. ఏ అప్ డేట్ ఇవ్వకుండానే విజయ్ నటించిన మరో సినిమాను విడుదలకు సిద్ధం చేసేశారు. ఆ సినిమానే.. గీత గోవిందం.

టాక్సీవాలా’ సినిమాతో దీనికి ఏం సంబంధం అనుకోవడానికి కూడా లేదు. ఈ రెండు చిత్రాల్లోనూ గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామే కావడం గమనార్హం. ‘టాక్సీవాలా’ను యువి క్రియేషన్స్ తో కలిసి నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ.. ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లో జాప్యం అవుతుండటంతో దాన్ని పక్కన పెట్టేసి ‘గీత గోవిందం’ను విడుదలకు రెడీ చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రోజే రిలీజ్ డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నాకు 25 ఏళ్లు.. నేనింకా వర్జినే అని విజయ్ దేవరకొండ చెబుతుంటే సీరియస్ గా చూస్తోంది హీరోయిన్. ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. గోపీసుందర్ సంగీతాన్నందించాడు. గీత అనే అమ్మాయి.. గోవింద్ అనే అబ్బాయికి మధ్య నడిచే ప్రేమకథ ఇదని సమాచారం. మరి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తనపై యువతలో ఉన్న అంచనాల్ని విజయ్ ఈ సినిమాతో ఏమాత్రం అందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News