'సీటీమార్' సీటీ కొట్టించడం ఖాయం: గోపీచంద్

Update: 2021-09-05 07:30 GMT
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ' సీటీమార్' సినిమా రూపొందింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తరుణ్ అరోరా .. రెహ్మాన్ .. రావు రమేశ్ .. పోసాని .. భూమిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మాట్లాడారు.

'సీటీమార్' సినిమా కబడ్డీ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమా షూటింగు మొదలుపెట్టిన కొన్ని రోజుల తరువాత కరోనా తీవ్రతరమైంది. దాంతో కొంతకాలం పాటు షూటింగు ఆపేశాం. మళ్లీ షూటింగు మొదలుపెట్టిన రెండు నెలలకి మరోసారి కరోనా విరుచుకుపడింది. అప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకున్నాము. ఇలా అవాంతరాల మధ్య ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. కబడ్డీ టీమ్ లో నిజంగా ఆట గురించి బాగా తెలిసిన వాళ్లు ఓ నలుగురు ఉన్నారు. మిగతావాళ్లకి కొంత కాలం  పాటు ట్రైనింగ్ ఇవ్వవలసి వచ్చింది.

ఈ సినిమా కోసం మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చిన అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. ట్రైనింగ్ సమయంలోను .. షూటింగ్ సమయంలోను దెబ్బలు తగిలినా ఓర్చుకున్నారు. వాళ్ల అంకితభావం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా విషయానికి వస్తే కబడ్డీ గురించి నాకు తెలుసు .. గతంలో నేను కబడ్డీ ఆడాను. ఈ సినిమాను నేను ఏపీ టీమ్ కోచ్ గా ... తమన్నా తెలంగాణ టీమ్ కోచ్ గా కనిపిస్తాము. ఈ రెండు టీమ్ ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరికి ఎవరు విజయాన్ని సాదిస్తారనేది సస్పెన్స్.

గతంలో కబడ్డీ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి .. ఆ సినిమాల్లో కథలో ఒక భాగంగా కబడ్డీ ఉండేది. కానీ గాళ్స్ కబడ్డీపై సినిమాలు రాలేదు. తెలుగులో మొదటిసారిగా పూర్తి కబడ్డీ నేపథ్యంలోనే రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాను చూస్తూ సీటీ కొట్టకుండా ఉండలేరు. అంత ఆసక్తికరంగా సాగుతుంది. గతంలో నేను సంపత్ నంది కలిసి చేసిన 'గౌతమ్ నంద' సినిమా అంతగా ఆడలేదు. ఒక సినిమా ఆడకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అయినా నేను ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం గురించి మాట్లాడుతున్నారు.

నాకు కథ నచ్చితే .. నమ్మితే చేస్తాను అంతే .. మిగతా విషయాలను గురించి నేను పెద్దగా ఆలోచన చేయను. సంపత్ నంది కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. అందుకే ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఓకే చెప్పాను. సినిమా హిట్ అయితే తరువాత సినిమా అంతకంటే బాగుండేలా చూడాలని అనుకుంటాను. ఫ్లాప్ అయితే ఎందుకు అలా జరిగిందనే ఒక ఆలోచన చేస్తాను. ఆ తరువాత అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. అంతేగానీ సక్సెస్ అయితే పొంగిపోవడం, ఫ్లాప్ అయితే కుంగిపోవడం ఉండదు" అని చెప్పుకొచ్చారు.             
Tags:    

Similar News