చరణ్ గుట్టు విప్పేశాడు

Update: 2015-10-12 22:30 GMT
సినీ పరిశ్రమలో అందరూ సక్సెస్ చుట్టూనే తిరుగుతారు. ఒక హిట్టిస్తే చాలు.. ఆ రోజంతా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడతాయి. కానీ ఫ్లాప్ కొడితే పట్టించుకునేవాడుండడు. అంతకుముందు కమిటైన ప్రాజెక్టులు కూడా పక్కకెళ్లిపోతాయి. మొహమాటం లేకుండా ‘నో’ అనేస్తారు జనాలు. పేర్లెందుకు కానీ.. ఇలాంటి ఉదాహరణలు గత కొన్నేళ్లలో చాలా ఉన్నాయి. ఓ డైరెక్టరుతో ముందు సినిమా ఓకే అనుకుని.. అతను ఫ్లాప్ తీయగానే పక్కనబెట్టేసిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలా చేయలేదు.

‘కిక్-2’ డిజాస్టరైన నేపథ్యంలో సురేందర్ కు చరణ్ టాటా చెప్పేస్తున్నాడని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే సురేందర్ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు చరణ్. కాకపోతే ముందు అనుకున్న డైరెక్ట్ కథతో కాకుండా.. తనీ ఒరువన్ రీమేక్ కోసం జత కట్టబోతున్నారు వీళ్లిద్దరూ. ఐతే నిజానికి ‘తనీ ఒరువన్’ రీమేక్ కు సురేందర్ రెడ్డి చేయాల్సింది కాదట. కానీ మాట నిలబెట్టుకోవడానికే చరణ్ అతడికి అవకాశమిచ్చాడట. ఈ సంగతి చరణ్ తో వచ్చే ఏడాది సినిమా చేయబోతున్న తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వెల్లడించాడు.

‘‘తనీ ఒరువన్ రీమేక్ హక్కుల విషయంలో నేనే మధ్యవర్తిగా వ్యవహరించా. నిజానికి తెలుగులోనూ తనే డైరెక్టర్ చేయాలని ఆశ పడ్డాడు రాజా. కానీ చరణ్ ఇంతకుముందే సురేందర్ రెడ్డికి కమిట్ మెంట్ ఇవ్వడంతో మాట తప్పలేక అతడికే ఈ సినిమా చేసే అవకాశమిచ్చాడు. రాజాకు సారీ చెప్పేశాడు. ఐతే రాజాకు మళ్లీ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కుతుంది. చరణ్ తప్పకుండా అవకాశమిస్తాడు’’ అని చెప్పాడు గౌతమ్ మీనన్.
Tags:    

Similar News