ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..!

Update: 2022-06-21 09:07 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు (APSFDC) దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అయితే సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించే వ్యవహారానికి సంబంధించి జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ లో అమ్మేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం మరియు ఈ మేరకు జారీ చేసిన జీవోని సవాలు చేస్తూ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరియు దాని డిప్యూటీ జనరల్ మేనేజరు సందీప్ అన్నోజ్వాలా హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ లో న్యాయ, శాసనసభ కార్యదర్శి - హోంశాఖ ముఖ్యకార్యదర్శి - ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎల్టిటివీటిడీసీ) - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యం పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా మరియు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం వల్ల 80 శాతం ప్రభావితం అయ్యేది ఆన్లైన్ వేదికగా టికెట్లను విక్రయిస్తున్న పిటిషనర్ సంస్థలేనని కోర్టుకు వివరించారు. సినిమా టికెట్ల విక్రయం ద్వారా సర్వీసు ఛార్జీ కింద వచ్చే రూ. 2లో ప్రభుత్వానికి రూ.1.97 వెళుతుందని.. కేవలం మూడు పైసలు మాత్రమే తమకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఈ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వానికి తగిన వేదిక లేదని పేర్కొన్నారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా ఇదే వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేశాయని.. దానిలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న వారందరికీ నోటీసులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

కాగా, బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్ పెట్టడానికి.. అంతా పారదర్శకంగా జరగడానికి ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీన్ని సినీ ప్రముఖులు కూడా స్వాగతించారు. ఈ నేపథ్యంలో జూన్ 2న ఉత్తర్వులు ఇస్తూ 30 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్ళగా.. మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సొంత వేదికలపై టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ఆన్ లైన్ టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తెచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్నాళ్లు వేచి చూద్దామని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ అంశంలో మల్టిప్లెక్స్ల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. జూలై 12న దీనిపై తదుపరి విచారణ జరగనుంది.
Tags:    

Similar News