గుప్తనిధులతో రుద్ర‌మ‌దేవి తీశాడ‌ట‌

Update: 2015-10-05 03:58 GMT
గుణ‌శేఖ‌ర్ ఓ ద‌ర్శ‌కుడు. కానీ ఆయ‌న 60కోట్ల పైచిలుకు బ‌డ్జెట్‌ తో సినిమాని మొద‌లుపెట్టేస‌రికి అంతా అవాక్క‌య్యారు. అంత డ‌బ్బు ఎక్క‌డ్నుంచి తీసుకొస్తున్నాడు?  గుణ సాహ‌సం చేస్తున్నాడా? అంటూ మాట్లాడుకొన్నారు. కొద్దిమందేమో పొలిటిక‌ల్ లీడ‌ర్ల స‌పోర్ట్‌ తో సినిమా తీస్తున్నాడ‌ట అని చెప్పుకొన్నారు. అయితే గుణ‌శేఖ‌ర్ మాత్రం మ‌రో క‌థ‌ని వినిపిస్తున్నాడు. నాకు గుప్త‌నిధులు దొరికాయ‌ని, వాటితోనే సినిమా తీశాన‌ని చెప్పుకొచ్చాడు. ఆదివారం హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ప్రెస్‌ మీట్ లో గుణ అదే విష‌యాన్ని బ‌ట‌య‌ట‌పెట్టాడు.
 
కానీ గుణ‌శేఖ‌ర్‌ కి దొరికిన గుప్త‌నిధి ధ‌నం రూపంలో కాద‌ట‌.రుద్ర‌మ‌దేవి క‌థ రూపంలోనేన‌ట‌. ఆ విష‌యం గురించి మాట్లాడుతూ ``రుద్ర‌మ‌దేవి కోసం అంత డ‌బ్బు ఎక్క‌డ్నుంచి తీసుకొచ్చావ‌ని నా  స్నేహితులు కూడా అడుగుతుంటారు. అందుకు నేను చెప్పే స‌మాధానం ఒక్క‌టే గుప్త‌నిధి దొరికింద‌ని. నిజంగానే  నాకు నిధి దొరికింది. అయితే రుద్ర‌మదేవి క‌థ రూపంలో. ఆ క‌థే కోట్ల రూపాయ‌ల విలువ చేసేంత స్ఫూర్తినిచ్చింది. అందుకే ఎన్ని క‌ష్టాలైనా ఈ సినిమా చేశా.  అంతే త‌ప్ప  నేను గ్రాఫిక్స్‌ కోసమో  - విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోస‌మో ఈ సినిమా తీయ‌లేదు`` అన్నాడు గుణ‌. ఈ సంద‌ర్భంగా త‌న సినిమాపై వ‌చ్చిన అపోహ‌ల్ని కూడా తొల‌గించే ప్ర‌య‌త్నం చేశాడాయ‌న‌.

 సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుకొన్న స‌మ‌యానికి అనుకొన్న‌ట్టుగానే వ‌స్తుంద‌ని, టుడీతో పాటు  త్రీడీలోనూ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు. ప‌దిహేను రోజులుగా చిత్ర‌బృందం నిద్రాహారాలు మాని క‌ష్ట‌ప‌డింద‌నీ, దాంతో త్రీడీ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, త్రీడీ వెర్ష‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. రుద్ర‌మ‌దేవి కి రెండు సార్లు సెన్సార్ జ‌రిగింద‌న్న వార్త‌ల‌ను కూడా గుణ  ఖండించారు. ఒక్క‌సారే సెన్సార్ జ‌రిగింద‌ని, తొలిసారి ట్రైల‌ర్ కోసం సెన్సార్ జ‌రిపామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని తీసుకొస్తుందో చూడాలి.
Tags:    

Similar News