వెబ్ సిరీస్ లు అంటే బూతులు అనే మైండ్ సెట్ మారాలి!

Update: 2022-01-28 04:31 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో హరీశ్ శంకర్ ఒకరు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. కథను రాసుకోవడంలోనూ .. దానిని తెరపై ఆవిష్కరించడంలోను తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. తన తదుపరి సినిమాను ఆయన పవన్ కల్యాణ్ తో చేయనున్నాడు. ఆ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను కూడా ఆయన సెట్ చేశాడు. అయితే ఆ సినిమా షూటింగు మొదలుకావడానికి ఇంకా సమయం ఉంది. అందువలన ఆయన ఈ లోగా జీ 5 కోసం 'ATM' అనే వెబ్ సిరీస్ ను చేయడానికి రంగంలోకి దిగాడు.

ఈ వెబ్ సిరీస్ కి ఆయన దర్శకుడు మాత్రమే కాదు .. నిర్మాత కూడా. దిల్ రాజుతో కలిసి ఆయన ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా ఆయన తెలియజేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన విలేకరుల ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందిస్తూ .. "మనందరికీ ఒక మైండ్ సెట్ ఉంది. వెబ్ సిరీస్ అనగానే శృతిమించిన రొమాన్స్ .. బూతులు .. వయలెన్స్ ఉంటాయని అనుకుంటారు. ఈ వెబ్ సిరీస్ రాసిన ఒక రైటర్ గా నేను చెప్పదలచుకున్నదేమిటంటే, వెబ్ సిరీస్ రాస్తున్నప్పుడు రైటర్ గా ఒక ఫ్రీడమ్ ఉంటుంది .. మేము చిన్నప్పటి నుంచి చదివిన బోలెడు కథలు .. బోలెడు నవలలు కారణంగా ఒక డిఫరెంట్ కంటెంట్ తో రావాలనుకుంటాము.

వెబ్ సిరీస్ అనగానే బూతులు .. వయలెన్స్ ఉండాలనేం లేదు. మా వెబ్ సిరీస్ అందుకు భిన్నంగా నడుస్తుందని నేను చెప్పగలను. 'సినిమాను ఓటీటీ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇటువైపు రావడం జరిగిందా? లేదంటే ఒక కొత్తదనం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా? అనే ప్రశ్నకు హరీశ్ శంకర్ స్పందిస్తూ .. "మొన్న 'అఖండ' .. 'పుష్ప' .. 'శ్యామ్ సింగ రాయ్' ఇవన్నీ ఎలా థియేటర్స్ లో రికార్డులు బద్దలు కొట్టాయనేది మేమందరం చూశాము. సినిమాను ఓటీటీ డామినేట్ చేస్తుందనే దానిని నేను ఏకీభవించను. ఎందుకంటే చిన్నప్పుడు కేబుల్ టీవీలు వచ్చినప్పుడు .. ఇక సినిమా పనైపోయింది .. థియేటర్లకి ఎవరూ రారు అనుకున్నారు.

కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్ని థియేటర్స్ డెవలెప్ అయ్యాయనేది మనందరికీ తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అనేది అనెదర్ మీడియం .. నాట్ ఆల్టార్నేటివ్ మీడియం. ఇంట్లో వేంకటేశ్వరస్వామి ఫొటో ఉందికదా అని తిరుపతి వెళ్లకుండా ఉంటామా? తప్పకుండా తిరుపతి వెళతాము .. ఇది కూడా అంతే. మా థియేటర్లనేవి మాకు దేవాలయాల వంటివే. డెఫినెట్ గా జనాలు థియేటర్లకు వస్తారని మేము నమ్ముతున్నాము" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News