'పుష్ప' హిందీ రిలీజ్ కు మార్గం సుగమం అయిందా..?

Update: 2021-11-15 10:34 GMT
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 2022 డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే హిందీ విడుదల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని.. డబ్బింగ్ రైట్స్ యజమానులతో సమస్యల కారణంగా థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాకపోవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి.

వాస్తవానికి 'పుష్ప' సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు అప్పుడెప్పుడో గోల్డ్‌ మైన్ ఫిల్మ్స్‌ కు చాలా తక్కువ ధరకు విక్రయించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ హిందీ మార్కెట్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు వారితో చర్చలు జరపగా.. హిందీ రైట్స్ ను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారని టాక్ వచ్చింది. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బన్నీ సినిమాని థియేటర్‌లలో నేరుగా విడుదల చేయడానికి మార్గం సుగమం అయిందని తెలుస్తోంది.

'పుష్ప' నిర్మాతలు ఇటీవల గోల్డ్‌ మైన్ ఫిల్మ్స్‌ తో చర్చలు జరిపి, కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట. ఆ సంస్థ మరో డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌ తో కలిసి హిందీలో కూడా ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. 'హే బిడ్డా ఇది నా అడ్డా' సాంగ్ అప్డేట్ సందర్భంగా అల్లు అర్జున్ కు సంబంధించిన హిందీ పోస్టర్ ని కూడా విడుదల చేయడాన్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

నవంబర్ 19న 'పుష్ప' సినిమాలోని నాల్గవ పాటను హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ట్రైలర్ హిందీలో డబ్ చేయబడుతుండగా.. అతి త్వరలోనే దీన్ని ఆవిష్కరించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా ఒకేసారి ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అయిన మొదటి చిత్రంగా ''పుష్ప: ది రైజ్'' నిలవనుంది.

కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ - అనసూయ - ధనుంజయ ఇతర కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.




Tags:    

Similar News