లేడీ కాస్ట్యూమ్ డిజైన‌ర్ కి హీరోగారి ప్ర‌మోష‌న్!

Update: 2019-10-31 11:37 GMT
క్రియేటివ్ రంగంలో ప్ర‌తిదీ క్రియేటివ్ గానే ఆలోచించాలి. రొటీన్ గా ఆలోచిస్తే స్పేస్ ఉండ‌దిక్క‌డ‌. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఉండాలి స్టెప్స్. ప్ర‌స్తుతం నాని అడుగులు చూస్తుంటే అదే దారిలో వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాను ఎంచుకునే స్క్రిప్టులు మాత్ర‌మే కాదు.. తాను ఎంచుకునే నిర్మాత‌ల విష‌యంలోనూ అంతే క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాడు.

ఇన్నాళ్లు త‌న‌కు కాస్ట్యూమ్స్ అందించిన వ్య‌క్తిగ‌త డిజైన‌ర్ ని కూడా ఇప్పుడు నిర్మాత‌ను చేసేయ‌డం పెట్టుబ‌డులు పెట్టించే ప‌నిలో ఉండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రామె అంటే .. డిజైన‌ర్ ప్ర‌శాంతి త్రిపుర‌నేని. వాల్‌ పోస్టర్‌ సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన తొలి ప్రయత్నంగా `అ!` చిత్రాన్ని నిర్మించ‌న నాని ఇప్పుడు ఇదే బ్యాన‌ర్ లో త‌న ప‌ర్స‌న‌ల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ని నిర్మాత‌గా ప‌రిచ‌యం చేస్తూ.. తాను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫలక్‌నుమా దాస్‌ ఫేమ్‌ విశ్వక్‌సేన్ కి ఇదో క్రేజీ ఆఫ‌ర్. చిలసౌ ఫేమ్‌ రుహానీ శర్మ ఈ చిత్రంలో క‌థానాయికా న‌టిస్తోంది. శైలేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవ‌లే సినిమా ప్రారంభమైంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ ని రివీల్ చేశారు. HIT (హిట్) అనేది ఈ సినిమా టైటిల్. `ది ఫ‌స్ట్ కేస్` అంటూ ఉప‌శీర్షిక‌. పోస్ట‌ర్ లో విశ్వ‌క్ ముఖంపై చివ్వున చిమ్మిన ర‌క్తం క‌నిపిస్తోంది. ఒక క‌న్ను చూడ‌కూడ‌నిదేదో చూసింది అన్న‌ట్టుగా తీక్ష‌ణంగా చూస్తోంది. ఉప‌శీర్షిక‌ను హింటుని బ‌ట్టి ఇది ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ అని అర్థ‌మ‌వుతోంది. నేటి నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. శైలేష్ కొల‌ను ఈ చిత్రానికి క‌థ క‌థ‌నం అందించ‌డ‌మే గాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వివేక్‌సాగర్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.మణికందన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇలా ఒక డిజైన‌ర్ తో పెట్టుబ‌డి పెట్టించ‌డ‌మేమిటో అంటూ ప‌రిశ్ర‌మ‌లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌శాంతి త్రిపుర‌నేని ప‌లు చిత్రాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ గా ప‌ని చేసి పాపుల‌ర‌య్యారు. అలా సంపాదించిన డ‌బ్బుని ఇలా ప‌రిశ్ర‌మ‌కే కేటాయిస్తున్నారా?   నాని పేరు స‌మ‌ర్ప‌కుడిగా వేశారు కాబ‌ట్టి బిజినెస్ ప‌రంగా ప్ర‌చారం ప‌రంగా క‌లిసొస్తుంద‌నేగా..!! అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News