నిరాడంబ‌రంగా నిఖిల్ పెళ్లి.. 32 మంది అతిథులు

Update: 2020-05-14 04:00 GMT
పెళ్లిళ్లకు 50 మంది అతిధులు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది ప్ర‌భుత్వాల నిబంధ‌న‌. లాక్ డౌన్ పొడిగింపు కార‌ణంగా అతిధుల సంఖ్యను 20 నుంచి 50కి పెంచింది కేంద్రం. అయితే ఈ నియ‌మాన్ని పాటిస్తూనే యువ‌హీరో నిఖిల్ ఎంతో నిరాడంబ‌రంగా పెళ్లాడాడు. నిఖిల్ సిద్ధార్థ్ ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడేశాడు. శామిర్ పేటలోని ఓ ప్ర‌యివేటు అతిథి గృహంలో ఈ జంట పెళ్లి అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగింది.

నిజానికి ఘ‌న‌మైన పెళ్లినే ఆశించినా కానీ క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా ప్లాన్ అంతా ఛేంజ్ అయ్యింది. నేటి (మే 14న) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన సుముహార్తానికి నిఖిల్- పల్లవి వర్మ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ప‌ల్ల‌వితో నిఖిల్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. తొలుత నిఖిల్ స్వ‌యంగా ప‌ల్ల‌వికి ప్రేమ‌ను ప్ర‌పోజ్ చేశారు. ఇరువురి మ‌న‌సులు క‌లిసాయి. అనంత‌రం ఫిబ్ర‌వ‌రిలో గోవా వేదిక‌గా కుటుం స‌భ్యులు స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం పూర్త‌యింది. ఏప్రిల్ 16న వివాహ ముహూర్తాన్ని నిశ్చ‌యించినా కొవిడ్ 19తో లాక్ డౌన్ స‌న్నివేశం తెలిసిందే. లాక్ డౌన్ అన్ని పెళ్లిళ్ల‌కు చెక్ పెట్టేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఇరు కుటుంబ స‌భ్యులు నిరాడంబ‌ర పెళ్లికి సై అనేశారు.

మునుముందు లాక్ డౌన్ పెరుగుతుందే కానీ త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే ముహూర్త బ‌లం పోకుండా ఇలా సింపుల్ గా పెళ్లిని కానిచ్చేశారు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్ లో కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో భౌతిక దూరం పాటిస్తూనే ఈ జోడీ వివాహం చేసుకున్నారు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. నిఖిల్ పెళ్లికి 32 మంది అతిధులు హాజ‌ర‌య్యార‌ని తెలిసింది. ఈ పెళ్లికి కేవ‌లం నిఖిల్ స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

టాలీవుడ్ లో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న హీరోగా నిఖిల్ పేరు మార్మోగుతోంది. అత‌డి సెలెక్ష‌న్స్- హార్డ్ వ‌ర్క్- ల‌క్ ఈ స్థాయికి తెచ్చాయి. ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడ‌య్యాడు. ఇక‌పైనా వ‌రుస విజ‌యాల‌తో పెద్ద రేంజుకు ఎద‌గాల‌ని తుపాకీ ఆకాంక్షిస్తోంది. `తుపాకీ` త‌ర‌పున‌ నిఖిల్ కి ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు.
Tags:    

Similar News