తనీష్ బొమ్మ పడనివ్వమంటున్న లారా వర్గీయులు

Update: 2018-11-14 19:40 GMT
బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తనీష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలతో మెప్పించాడు. అయితే హీరోగా మాత్రం సెటిల్‌ అవ్వలేక పోయాడు. తాజాగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పాల్గొని ఫైనల్‌ వరకు వెళ్లాడు. దాంతో తనీష్‌ కు మరింత గుర్తింపు దక్కింది. హీరోగా తనీష్‌ తాజాగా ‘రంగు’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ చిత్రం ఒక రౌడీ షీటర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. కాని తాజాగా సినిమా ట్రైలర్‌ లో లారా అనే రౌడీ షీటర్‌ అంటూ మొదలు అవ్వడంతో సినిమాపై వివాదం మొదలు అయ్యింది.

విజయవాడకు చెందిన రౌడీ షీటర్‌ లారా జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించారు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అధికారికంగా ఒప్పుకుంటున్నారు. లారా జీవితం గురించిన లేని పోని అబద్దాలు చూపించారేమో అంటూ ఆయన సన్నిహితులు మరియు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రంగు’ మాకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని, లేదంటే సినిమా పోస్టర్‌ ను, సినిమాను విజయవాడలో పడనివ్వం అంటూ హెచ్చరించారు.

‘రంగు’పై లారా సన్నిహితులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై తనీష్‌ స్పందించాడు. లారా జీవితంలో అనేక ఒడిదొడుకులు ఉన్నాయి. ఆయన జీవితంలోని నాలుగు దశలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. లారా గురించి చాలా పాజిటివ్‌ గా ఈ చిత్రంలో చూపించాం. ఆయన సన్నిహితులకు అనుమానాలు, భయం ఉండటం సర్వ సాధారణం. ఎవరైతే సినిమా చూడాలని కోరుకుంటున్నారో వారికి తప్పకుండా ‘రంగు’ చూపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకునే విధంగా సినిమా ఉంటుందని తనీష్‌ అన్నాడు. సినిమా పోస్టర్‌ పడుతుంది, ఈనెల 23న సినిమా కూడా విడుదల అవుతుందని తనీష్‌ అన్నాడు.

Tags:    

Similar News