నటుడు వర్సెస్ కాంగ్రెస్.. ఎందుకీ వివాదం..? ఎక్కడ మొదలైంది..?

Update: 2021-11-16 05:34 GMT
సినీ నటులు, రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సినిమాల్లో నటించినవారు ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్తుంటారు. ఈ క్రమంలో రెండు రంగాల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగానే ఉంటుంది. కానీ కేరళ రాష్ట్రంలో  పొలిటికల్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్న విధంగా మారింది. ఓ నటుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవ పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంపై అసెంబ్లీ వేదికగా చర్చించే దాకా  వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్ విరుచుకుపడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం కరెక్ట్ కాదని ఫిల్మ్ నగర్ ఆరోపిస్తోంది. ఇంతకీ సినిమా ఇండస్ట్రీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య వివాదం ఎక్కడ మొదలైంది..? ఇంతలా దుమారం లేవడానికి కారణం ఏంటి..?

మళయాళ నటుడు బోజు జార్జ్.. ప్రముఖ హస్య నటుడు.ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను తప్పు చేయంది ఎందుకు క్షమాపణలు చెప్పాలని నటుడు జార్చ్ అంటున్నాడు. దీంతో ఇరువురి మధ్య రోజూ ఆరోపారోపణలు కొనసాగుతున్నాయి.

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఈనెల 1న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా తిరువనంతపురంలోని వైట్టిల ఎడపల్లి జాతీయరహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇందులో నటుడు బోజు జార్జ్ ఇరుక్కుపోయారు. అయితే తనకూతురిని కీమోథెరపీకి తీసుకెళ్తున్న సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్తతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు బోజు కారు అద్దాలు పగలగొట్టారు. నటుడు పోలీస్ స్టేషన్ ను సంప్రదించడంతో వారిపై కేసులు నమోదయ్యాయి.

అప్పటి నుంచి నటుడు, కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నటుడికి తలపొగరు తగ్గేందుకు చట్టప్రకారం శిక్షించాలని పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరణ్ ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మత్తం జార్జ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ చిత్రసీమ అన్నట్లుగా మారింది.ఈ విషయం అసెంబ్లీ వేదికపైకి వెళ్లింది. కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. సినిమా షూటింగ్ లను అడ్డుకుంటే సహించేది లేనది కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తోంది. సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్నజార్జ్ ను కాంగ్రెస్ ఇలా కక్షకట్టడం సరికాదంటున్నారు. కెరీర్ లో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ జార్జ్ సాధరణ గ్రామస్తుడిలా జీవిస్తున్నాడని అంటున్నారు. జార్జ్ ను బెదిరింపులతో ఇబ్బందులకు గురిచేస్తున్నా కాంగ్రెస్ నాయకులు వివాదాలకు త్వరగా స్వస్తి పలకాలని అంటున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉన్నికృష్ణన్ ప్రతిపక్ష నేత సతీష్ ను కోరారు.

అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం జార్జ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించిన జార్జ్ క్షమాపణ చెప్పేవరకు విడిచిపెట్టేది లేదని ఎర్నాకులం జిల్లా కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఈ నిరసనను వ్యతిరేకిస్తున్నారు. పెట్రో ధరలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలతో లాభం లేదని, తాము చేసే ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా కేంద్రం, కేరళ ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడేసే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుందని అన్నారు.
Tags:    

Similar News