పెద్ద బ్యానర్లలో ఛాన్స్ ఇవ్వరా?

Update: 2016-03-29 09:22 GMT
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత మంచి సినిమాలు చేశామన్నది ముఖ్యం అంటోంది తెలుగమ్మాయి నందిత రాజ్. ఈ శుక్రవారం ‘సావిత్రి’గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్న నందిత.. ఇప్పటిదాకా తాను చేసిన సినిమాల విషయంలో చాలా సంతృప్తిగానే ఉన్నానని.. ఐతే పెద్ద బ్యానర్లలో అవకాశాలు రాకపోవడమే తనకు నిరాశ కలిగిస్తోందని చెబుతోంది. ‘‘కెరీర్ సంతృప్తికరంగా సాగుతోందా అని అడిగితే.. సమాధానం ఔనని చెప్పాలి.. అలాగే కాదు అని చెప్పాలి. తక్కువ సినిమాలే చేస్తున్నానని బాధ లేదు. మంచి పాత్రలు చేస్తున్న సంతృప్తి ఉంది. ఐతే పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయాలని నా ఆశ’’ అంటోంది నందిత.

‘సావిత్రి’ సినిమా గురించి చెబుతూ.. ‘‘జీవితంలో పెళ్లి త్వరగా చేసేసుకోవాలనే కోరిక ఉన్నసాధారణ అమ్మాయి పాత్ర. ఈ కోరికే కథలో కీలక మలుపుకి కారణం అవుతుంది. నా జీవితంలోకి హీరో వచ్చాక కథ ఎలా మారుతుందన్నది స్థూలంగా సినిమా కథ. ‘సావిత్రి’ ఎలాంటి అసభ్యత లేని ఓ మంచి కుటుంబ కథా చిత్రం. కథలో భాగంగా ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంది. ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుంది’’ అని చెప్పింది. హీరో నారా రోహిత్ గురించి చెబుతూ.. ‘‘తన పని తాను చేసుకుపోవడం తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు. మంచి మనిషి. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు’’ అని చెప్పింది. తెలుగమ్మాయినే అయినా.. తనకు వేరే వాళ్లతోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారని.. ఐతే తనకు మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని.. భవిష్యత్తులో తప్పకుండా ఆ పని చేస్తానని నందిత చెప్పింది.
Tags:    

Similar News