ఛార్మిఆరోప‌ణ కోర్టులో నిల‌వ‌లేదు

Update: 2017-07-25 11:32 GMT
సిట్‌ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఛార్మి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు బ‌ల‌వంతంగా ర‌క్త న‌మూనాలు సేక‌రిస్తున్నార‌ని ఛార్మి ఆరోపించింది. ఈ వ్య‌వ‌హారంలో ఛార్మికి హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ విచారణలో ఛార్మితో పాటు న్యాయవాదిని అనుమతించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆమె ఒంట‌రిగానే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని తెలిపింది. ఛార్మి పిటిష‌న్ పై హైకోర్టు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తీర్పు వెల్ల‌డించింది.

సిట్ విచార‌ణ సంద‌ర్భంగా ఛార్మి నుంచి బలవంతంగా రక్త నమూనాలు సేకరించరాదని హైకోర్టు ఆదేశించింది. ఆమె అనుమ‌తి ఉంటే తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆమెను విచారించాలని, విచారణ‌ బృందంలో త‌ప్ప‌నిస‌రిగా మహిళను నియమించాలని తెలిపింది. ఒకవేళ, ఒకే రోజులో విచారణ పూర్తి కాకపోతే, మ‌రుస‌టిరోజు పిల‌వాల‌ని సూచించింది. ఛార్మి విచారణ ప్రాంతాన్ని సాయంత్రం సిట్ అధికారులకు చెబుతామని హైకోర్టు పేర్కొంది.

సిట్ విచార‌ణ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి విచార‌ణ‌లో ఓ మ‌హిళా అధికారి పాల్గొంటున్న‌ట్లు అకున్ స‌బ‌ర్వాల్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా, అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే బ్ల‌డ్ శాంపిల్స్ తీసుకుంటున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ రెండు విష‌యాల‌ను ప్ర‌ధానంగా పేర్కొంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసిన ఛార్మికి హైకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది. ఈ పిటిష‌న్ వల్ల ఛార్మి సాధించిందేమీ లేద‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు.

కాగా, ఛార్మి అనుమతిస్తే కనుక, ఇప్పుడైనా విచార‌ణ‌కు ఆమె ఇంటికి వెళ్తామని హైకోర్టులో సిట్ తెలిపింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని, నటుడు నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సేకరించలేదని వారు తెలిపారు.  విచారణకు వచ్చేవారితో మర్యాదగా ప్రవర్తిస్తున్నామని, ఛార్మిని మహిళా పోలీసులే విచారిస్తారని సిట్ పేర్కొంది.
Tags:    

Similar News