RRR ను వదలని హాలీవుడ్ డైరెక్టర్స్..!

Update: 2022-06-15 17:39 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ట్రిపుల్ ఆర్ విడుదలై మూడు నెలలు కావొస్తున్నా.. ఇంకా ఈ సినిమా మ్యానియా తగ్గలేదు.

ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని థియేటర్లలో దుమ్మురేపిన RRR.. 50 రోజుల తర్వాత ఓటీటీ వేదికల మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే.. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబడింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తొంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వీక్షించిన పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్టుగా '21 జంప్ స్ట్రీట్' 'ది లెగో' 'స్పైడర్ మ్యాన్: ఇన్ టూ ది స్పైడర్ వర్స్' వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ మిల్లర్ RRR సినిమాపై స్పందించారు.

''RRR అనేది ఓవర్ ది టాప్ ఒక అద్భుతమైన చిత్రం. ఇది మైఖేల్ బే - బాజ్ లుహ్ర్మాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి ఒక సినిమా రూపొందించడం వంటిది. 3 గంటల నిడివి ఉంది కానీ.. అది 4 గంటలు ఉన్నా కూడా నేను ఇంకా ఆనందిస్తాను'' అంటూ క్రిస్టోఫర్ మిల్లర్ ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ మూవీని మెచ్చుకున్నారు.

అంతకుముందు డిస్నీ - మార్వెల్ స్టార్ అలిస్ ఎక్స్ జాంగ్ మరియు హాలీవుడ్ టీవీ రచయిత అమీ పాలెట్ హార్ట్‌ మన్ వంటి పలువురు హాలీవుడ్ ప్రముఖులు RRR సినిమా గురించి స్పందించారు. ఇప్పుడు క్రిస్టోఫర్ మిల్లర్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

మార్చి 25న వరల్డ్ వైడ్ గా పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదలై 'ఆర్.ఆర్.ఆర్'.. రాజమౌళి గత చిత్రం 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితా చోటు సంపాదించింది.

ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు హాలీవుడ్ సెలబ్రిటీలు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని కొనియాడుతున్నారు. ఈ 'కేజీఎఫ్ 2' సినిమా కలెక్షన్స్ లో RRR ను అధిగమించినా.. ఈ విషయంలో మాత్రం కేజీఎఫ్ 2 కంటే ఆర్.ఆర్.ఆర్ మెరుగైన స్థానంలో ఉందని అనుకోవచ్చు.

కాగా, RRR చిత్రాన్ని 1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాసుకున్న కల్పిత కథతో ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ నటించారు.

అలియా భట్ - అజయ్ దేవగన్ - సముద్రఖని - ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ -రాహుల్ రామకృష్ణ ఇతరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
Tags:    

Similar News