మంచి సినిమా తీస్తే క్రిటిక్స్ ని ఇంత‌గా బ‌తిమాలాలా?

Update: 2020-12-02 16:00 GMT
ఇటీవ‌ల పూరి మ్యూజింగ్స్ సినీవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న అభిప్రాయాల్ని నిక్క‌చ్ఛిగా వాయిస్ రూపంలో బ‌య‌ట‌పెట్టేస్తుండ‌డంతో అవి కాస్తా ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇక పూరి లేటెస్ట్ గా ఫ్లాప్ నిర్మాత‌ల క‌ష్టాల గురించి వ‌ర్ణించారు. ఫ్లాపులు తీసిన వారిని కాపాడాల్సిందిగా ఫిలింక్రిటిక్స్ ని అభ్య‌ర్థించారు.

ఫ్లాపులు తీసిన వాళ్ల వ‌ల్ల‌నే సినీప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో ఉపాధి ల‌భిస్తోంద‌ని 85-90శాతం సినిమాలు ఫ్లాపులుగానే ఉన్నాయ‌ని వీటివ‌ల్ల‌నే ఎక్కువ‌మంది ఉపాధి పొందుతున్నార‌ని వారి ఉపాధిని పోగొట్ట‌వ‌ద్ద‌ని కూడా అభ్య‌ర్థించారు పూరి. ఫ్లాప్ నిర్మాత‌ల క‌ష్టాల గురించి అభివ‌ర్ణిస్తూ జ‌ర్న‌లిస్టుల స‌మీక్ష‌లు త‌మ‌పై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయో.. అవ‌కాశాల‌కు ఎలా గండి కొడుతున్నాయో.. బిజినెస్ అవ్వ‌కుండా చేస్తున్నాయో ప్ర‌తిదీ పూస గుచ్చిన‌ట్టు త‌న అనుభ‌వాల్ని ఇండ‌స్ట్రీలో ఫ్లాప్ నిర్మాత‌ల అనుభ‌వాల్ని య‌థాత‌థంగా పూస గుచ్చి చెప్పారు. అలాగే రేటింగ్స్ మ‌రీ నాశిర‌కంగా ఇవ్వ‌డం ద్వారా చాలా న‌ష్టం వాటిల్లుతోంద‌ని జ‌ర్న‌లిస్టులు అలా చేయ‌కుండా ప‌రిశ్ర‌మ‌ను కాపాడాల‌ని అభ్య‌ర్థించారు.

ఇక ప్ర‌తియేటా తీస్తున్న 200 సినిమాల్లో 190 ఫ్లాపులే తీస్తున్నామ‌ని అంగీక‌రించిన పూరి ఫ్లాపుల‌కు మంచి రేటింగ్ అడ‌గ‌డం విస్మ‌య‌ప‌రిచింది. చెత్త సినిమాలు చూసేందుకు జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌మ్మ‌ని క్రిటిక్స్ ఎలా రాస్తారో ఎలా రాయాలో కూడా వివ‌రంగా చెబితే బావుండేద‌న్న ప్ర‌తి విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.

రేటింగుల వ‌ల్ల‌ ఫ్లాప్ నిర్మాతలను పరిశ్రమ నుండి పారిపోయేలాగా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మంచి సినిమాలు తీయ‌లేని వాళ్లు ఉండీ ఏం లాభం అన్న క్రిటిసిజం నిర్మాత‌ల‌పై ఒక సెక్ష‌న్ నుంచి ఎదుర‌వుతోంది ఇలాంట‌ప్పుడు.

ఈ సినిమాలను విశ్లేషించలేని జర్నలిస్టులు తమకు నచ్చిన విధంగా రేటింగ్స్ ఇవ్వడానికి ఆశ్రయిస్తున్నారని విమ‌ర్శించారు. అలాగే ప‌త్రిక‌లు మీడియాల‌న్నిటికీ ధారాలంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నామ‌ని కూడా అన్నారు. అయితే ఇవ‌న్నీ నిజాలు కాజాల‌వ‌న్న వాద‌న కూడా అంతే బ‌లంగా జ‌ర్న‌లిస్టుల్లో ఉంది. ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న జ‌ర్న‌లిస్టులు ఇచ్చే రేటింగులను త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాద‌న్న ప్ర‌తి విమ‌ర్శ ఎదుర‌వుతోంది. ఇక ఫ్లాపులు తీసేవారంతా ఆత్మ‌శోధ‌న చేసుకోకుండా క్రిటిక్స్ ని విమ‌ర్శించి అబాసు పాలు కావ‌డం కూడా స‌రికాద‌న్న సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక దీనికి నిర్మాత‌ల మండ‌లి బాస‌ట‌గా నిల‌వ‌డం ఏమిటో కూడా అర్థం కావ‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. పూరి వ్యాఖ్యానానికి మ‌ద్ధ‌తుగా ఇప్పుడు మండ‌లి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్ - మోహన్ వడ్లపట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. మంచి సినిమా తీస్తే క్రిటిక్స్ ని ఇంత‌గా బ‌తిమాలాలా? అంటూ ఇట్నుంచి స‌ద‌రు నిర్మాత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి నాణేనికి రెండువైపులా ఉంటుంద‌న్న సంగ‌తిని గుర్తెరుగుతారనే భావించాలి.
Tags:    

Similar News