నా తన్నులు బాబూ మోహన్ ఎలా భరించాడో: కోట

Update: 2021-10-26 04:25 GMT
తెలుగు తెరపై ఎంతోమంది కమెడియన్లు సందడి చేస్తూ వస్తున్నారు. రేలంగి - రమణా రెడ్డి, రాజబాబు - అల్లు రామలింగయ్య తరువాత, ఆ స్థాయిలో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన జంటగా కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ కనిపిస్తారు. హాస్యాన్ని పండించే విషయంలో ఎవరి ప్రత్యేకత వారిది. తమ డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఇద్దరూ కూడా ప్రేక్షలోకానికి కితకితలు పెట్టేశారు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ లేని సినిమా ఉండేది కాదు. అంతలా ప్రేక్షకులు అభిమానించిన ఈ జంట, తాజాగా 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ వేదికపై కోట మాట్లాడుతూ .. "నేను .. బాబూ మోహన్ కలిసి మొదటిసారిగా చేసిన సినిమా 'బొబ్బిలి రాజా'. అప్పటికీ నేను 'ప్రతిఘటన'తో పాటు కొన్ని సినిమాలు చేసి ఉన్నాను. బాబూ మోహన్ అప్పటికీ జంధ్యాల సినిమాలు చేస్తున్నాడు. 'బొబ్బిలి రాజా' సినిమాలో మా కాంబినేషన్లో  ఓ నాలుగు సీన్లు ఉన్నాయి. ఇక మా బెస్ట్ కాంబినేషన్ వచ్చి 'మామగారు'  సినిమాతో మొదలైంది. ఈ సమయంలో ఒక్క విషయం మాత్రం చెప్పాలి. బాబూ మోహన్ పెక్యులర్ టైమింగ్ ఉన్న మంచి ఆర్టిస్ట్. సినిమాల్లో నేను వాడిని తన్నినటువంటి సీన్స్ చూస్తే, ఎట్లా భరించాడా అనుకుంటాము.

వాడి గొప్పతనం ఏమిటంటే .. టచ్ అయితే చాలు వెళ్లి పడిపోయేవాడు. అంత టైమింగ్ ను బాబూ మోహన్ మేనేజ్ చేయకపోతే నిజంగా నేను చాలా చెడ్డవాడిని అయ్యేవాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ఆర్టిస్ట్. ఓ 60 నుంచి 70 కాంబినేషన్లు చేశాము. ఒక్కోసారి ఇద్దరం కలిసి ప్రయాణాలు చేసేవాళ్లం. అలాంటి సమయాల్లో బాబూ మోహన్ తో నేను చాలా ఇబ్బందులే పడ్డాము. ఒకసారి మేము షూటింగుకు రాజమండ్రి వెళ్లాలి .. ఇద్దరం కలిస్ ట్రైన్ ఎక్కాము. రాజమండ్రి రాగానే నన్ను లేపమని చెప్పి నేను పడుకున్నాను.

ఒకరాత్రి వేళ 'రాజమండ్రి వచ్చేశాము .. దిగు దిగు' అంటూ నన్ను కంగారు పెట్టేశాడు. దాంతో నేను ఆ నిద్రమత్తులోనే గబగబా నా లగేజ్ తీసుకుని బాబూ మోహన్ తో పాటు ట్రైన్ దిగేశాను. దిగిన తరువాత చూస్తే నా కెందుకో డౌటు వచ్చింది. అక్కడున్న వున్న వ్యక్తిని అడిగాను 'ఏవయ్యా ఇది రాజమండ్రియేనా?' అని. 'కాదండి .. విజయవాడ' అన్నాడు వాడు. దాంతో నాకు కళ్లు తిరిగిపోయాయి .. ట్రైన్ వెళ్లిపోతోంది .. గబగబా పరిగెత్తుకువెళ్లి ముందుగా సామాను లోపల పడేసి మళ్లీ ట్రైన్ ఎక్కాము .. ఇలాంటి పనులు బాబూ మోహన్ చాలానే చేశాడు" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News