షాప్ కీప‌ర్ త‌న‌యుడు రియ‌ల్ హీరో ఎలా అయ్యాడు?

Update: 2022-07-30 15:30 GMT
యావ‌త్ దేశం మొత్తం కోవిడ్ కార‌ణంగా అల్లాడుతున్న వేళ నేష‌న‌ల్ వైడ్ గా వినిపించిన ఒకే ఒక్క పేరు సోను సూద్‌. పెద్ద వాళ్లు దేశాధినేత సైతం తాము ఏమీ చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేసిన వేళ అంద‌రికి నేనున్నానంటూ ముందుకొచ్చాడు. త‌న వంతు చేత‌నైన సాయం చేశాడు.

స‌డ‌న్ లాక్ డౌన్ విధించ‌డంతో సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన వారికి అండ‌గా నిలిచి బ‌స్సుల్లో, ట్రైన్ ల‌లో చివ‌రికి ప్ర‌త్యేక ఫ్లైట్ ల‌లో సొంత ఖ‌ర్చుల‌తో గ‌మ్య‌స్థానాల‌కు చేర్చి యావ‌త్ దేశం మొత్తం రియ‌ల్ హీరో అని కీర్తించేలా చేశారు. అలాంటి రియ‌ల్ హీరో సోను సూద్ పుట్టిన రోజు నేడు.

ఇన్నేళ్ల త‌న కెరీర్ లో ఎన్నో సినిమాల్లో న‌టించి హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, విల‌న్ గా అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నారు సోనుసూద్‌. నాగ్ పూర్ లోని య‌శ్వంత్ రావు చౌహాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న సొను తండ్రి ఓ సాధార‌ణ షాప్ కీప‌ర్‌. 1996లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోను ఆ త‌రువాత ముంబైలో అడుగుపెట్టాడు. న‌టుడు కావాల‌న్న‌ది అత‌ని కోరిక అయితే ముందు మోడ‌ల్ గా రాణిస్తే న‌టుడిగా అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌చ్చ‌ని ఆ వైపు అడుగులు వేశాడు.  

ప్ర‌తీ అడ్వ‌ర్టైజింగ్ కంప‌నీకి వెళ్ల‌డం.. క్యూలో నిల‌బ‌డ‌టం.. తిర‌స్కారాలు ఎదుర్కొని తిరిగి రావ‌డం.. ఇవి సొను 96 లో ముంబైలో ఎదుర్కొన్న అనుభ‌వాలు. విచిత్రం ఏంటంటే కెరీర్ ఓ సెట్ కాకుండానే 96లో సోను వివాహం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి అత‌నికి అసలు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ట‌. ఎక్క‌డికి ఛాన్స్ కోసం వెళ్లినా రిజెక్ష‌న్ లే అధికంగా వుండేవ‌ట‌. ఇలా ప్ర‌య‌త్నాలు చేసిన త‌రువాత దాదాపు మూడేళ్ల‌కు సౌత్ ఇండస్ట్రీ సోనుకు తొలి అవ‌కాశాన్ని అందించింది. త‌ను న‌టించిన తొలి త‌మిళ చిత్రం `క‌ల్లాజ్గ‌ర్‌`. విజ‌య్ కాంత్ హీరో, లైలా హీరోయిన్ గా న‌టించారు. అదే ఏడాది విజ‌య్ న‌టించిన `నెంజినిల్‌`లో విల‌న్‌గా అవ‌కాశం వ‌చ్చింది.

ఆ త‌రువాత జ‌య‌సుధ న‌టించిన `హ్యాండ్సప్‌`తో తెలుగులో తొలి అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌రోల్ లో మెరిసిన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాదిలో న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన మూడేళ్ల తరువాత సోను ని బాలీవుడ్ గుర్తించింది. 2002లో సోను హీరోగా `షాహీద్ -ఏ - ఆజ‌మ్‌` మూవీలో హీరోగా భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో న‌టించాడు. కానీ అది పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో మ‌ళ్లీ హీరోగా న‌టించ‌లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కీల‌క పాత్ర‌ల‌తో పాటు విల‌న్ పాత్ర‌ల‌కే ప‌రిమితం అయ్యాడు.

మోడ‌ల్ గా ప‌నికి రాడ‌ని తిర‌స్క‌రించిన సోను అదే మోడ‌ల్ రంగంలో అవార్డుని సొంతం చేసుకోవ‌డం విశేషం. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో న‌టిస్తూ న‌టుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సోను ..జాకీచాన్ న‌టించిన చైనీస్ మూవీ `కుంగ్ ఫూ యోగా`తో హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించారు.

రీసెంట్ గా విడుద‌లైన `ఆచార్య‌`లో విల‌న్ గా న‌టించిన సోను బాలీవుడ్ మూవీ `సామ్రాట్ పృథ్వీరాజ్‌`లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి నిరాశ ప‌రిచింది. ప్ర‌స్తుతం త‌మిళంలో `త‌మిళ‌ర‌స‌న్‌, హిందీలో `ఫ‌తే` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఓ షాప్ కీప‌ర్ త‌న‌యుడిగా మొద‌లైన సోనుసూద్ ప్ర‌యాణం రియ‌ల్ హీరోగా మారిన వైనం ప్ర‌తీ ఒక్క‌రికి స్ఫూర్తిగా నిల‌వ‌డం విశేషం.
Tags:    

Similar News